
‘హాట్ సీటు’ ఎవరిదో!
సాక్షి, రాజమండ్రి :వచ్చే అధికారి మనవాడైతే పుష్కరాల్లో అంతా చక్రం తిప్పవచ్చని కొందరు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పుష్కరాలకు ప్రధాన వేదికైన రాజమండ్రిలో ఉండే కీలక శాఖల ఉన్నతాధికారులు.. తాము చెప్పినట్టు తలాడించే వారే కావాలని ప్రజాప్రతినిధులు ఆరాటపడుతున్నారు. దీనిని ముందే గ్రహించిన కొందరు అధికారులు.. ఆ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ కుర్చీ ఇప్పుడు అధికార, రాజకీయ ప్రముఖులకు హాట్ టాపిక్‌గా మారింది.
పావులు కదుపుతున్న రాజేంద్రుడు
ప్రస్తుతం రాజమండ్రి కార్పొరేషన్‌లో రవీంద్రబాబు కమిషనర్‌గా కొనసాగుతున్నారు. అంతకుముందు ఈయన మున్సిపల్ రీజనల్ డెరైక్టర్‌గా పనిచేశారు. మళ్లీ ఈయనకే ఆర్‌డీ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇటీవల రెండు పదవులూ ఒకే అధికారి నిర్వర్తించడం విమర్శలకు దారితీసింది. దీంతో ఆర్‌డీగా కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పోస్టుకు గతంలో ఇక్కడే పనిచేసిన రాజేంద్రప్రసాద్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దాదాపు ఇది ఖాయమైనట్టు మున్సిపల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అంతటితో ఆగక ..
కాగా ఆర్డీగానే కాకుండా మున్సిపల్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు చేపట్టేలా రాజేంద్రప్రసాద్ స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్న రవీంద్రబాబు తమకు సహకరించడం లేదంటూ కొందరు టీడీపీ నేతలు ఆయన బదిలీకి పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా పురపాలక శాఖ అధికారులు తమకు సహకరించడం లేదని తరచూ బహిరంగంగా వ్యాఖ్యానించడం ప్రస్తుత కమిషనర్ బదిలీ వార్తలకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో పట్టు చలాయించాలని చూస్తున్న గోరంట్ల.. కమిషనర్‌ను కూడా తనకు అనుకూలంగా ఉండే వారిని రప్పించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే రాజేంద్రప్రసాద్ రాకపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాత్రం అయిష్టంగా ఉన్నట్టు తెలిసింది. పుష్కరాలను సమర్థంగా నిర్వహించాలంటే ఐఏఎస్ అధికారి ఉండాలని ఆయన పట్టుబడుతున్నారు.
ఇద్దరు అధికారుల నేపథ్యమిదీ..
గతంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ ఉన్నప్పుడు 2009 అక్టోబర్ 10 నుంచి జూలై ఏడు వరకు రాజేంద్రప్రసాద్ రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం జూలై తొమ్మిది నుంచి 2013 ఏప్రిల్ నాలుగు వరకు మున్సిపల్ ఆర్డీగా కొనసాగారు. అనంతరం మళ్లీ ఆయనే 2013 ఏప్రిల్ 20 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి రెండు వరకు కమిషనర్‌గా మరోసారి పనిచేశారు. ఈ కాలంలో ప్రస్తుత కమిషనర్ రవీంద్రబాబు ఆర్డీగా వ్యవహరించారు. రాజేంద్రప్రసాద్ బదిలీ కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి రెండున రవీంద్రబాబు కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుని, ఆర్డీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.