ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరుకు సర్వం సిద్ధం
నేటి ఉదయం 8 నుంచి సాయంత్రం
4 గంటల వరకూ పోలింగ్
117 పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు
453 మంది సిబ్బంది వినియోగం
కాకినాడ సిటీ :పరీక్ష పేపర్లు దిద్ది.. విద్యార్థులకు మార్కులు వేసే మాస్టర్లు.. శాసనమండలి బరిలో ఉన్న అభ్యర్థులకు మార్కులు వేసి, వారి తలరాతలను నిర్ధారించనున్నారు. శాసన మండలి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఆదివారం జరిగే పోలింగ్‌లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఉపాధ్యాయ ఓటర్లు నిర్దేశించనున్నారు. ఈ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని రెండు జిల్లాల్లో మొత్తం 117 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 453 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వీరిలో 129 మంది పీఓలు, మరో 129 మంది ఏపీఓలు, 195 మంది ఓపీఓలు ఉన్నారు. మొత్తం 117 పోలింగ్ కేంద్రాలను 27 రూట్లుగా విభజించి 27 మంది జోనల్ అధికారులను నియమించారు. 129 మంది మైక్రో అబ్జర్వర్లతో పోలింగ్ కేంద్రాలవద్ద నిఘా ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ చేసేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులను నియమించారు.
పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు
తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రితో శనివారం పయనమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని డివిజన్ కేంద్రాల నుంచి సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. రెండు జిల్లాల్లో 21,551 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ వేలేరుపాడులోని 112 నంబ ర్ పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా నలుగురు, నర్సాపురం డివిజన్ భీమవరం పట్టణంలోని 101వ నంబర్ పోలింగ్ కేంద్రం లో అత్యధికంగా 1070 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
జిల్లాలో 68 పోలింగ్ కేంద్రాలు
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లాలో 68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,176 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 721 పెద్ద బ్యాలెట్ బాక్సులను, 1090 చిన్న బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. జిల్లాను 21 రూట్లుగా విభజించి, 21 మంది జోనల్ అధికారులను, 75 మంది మైక్రో అబ్జర్వర్లను పర్యవేక్షణకు నియమించారు. ప్రిసైడింగ్ అధికారులుగా 75 మందిని, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా మరో 75 మందిని, ఇతర పోలింగ్ అధికారులుగా మరో 107 మందిని నియమించారు.
అందుబాటులో ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు ఎం.జగన్నాథం జిల్లాలో అందుబాటులో ఉంటారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులుంటే ఆయన సెల్ నంబర్ 88976 32532, ల్యాండ్‌లైన్ 0884-2350549కు ఫోన్ చేయవచ్చు.
పోటీలో 15 మంది
ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నోటాతో కలిపి ఎడమవైపున ఎనిమిది, కుడివైపున ఎనిమి ది మంది పేర్లతో బ్యాలెట్ పత్రం రూపొందించారు. అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడుల్లో ఓటర్లు తమకు నచ్చినవారికి ప్రాధాన్యతా ఓటు వేయాలి. పోలింగ్ కేంద్రం వద్ద సరఫరా చేసే వైలట్ స్కెచ్ పెన్‌తో మాత్రమే ఓటర్లు ఓటు వేయాలి. తనకు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదుట ఉన్న గడిలో ప్రాధాన్యతను తెలిపే ఒకటి అంకెను తప్పనిసరిగా వేయాలి. తరువాత మిగతా అభ్యర్థులకు ప్రాధాన్యతను తెలిపే వరుస క్రమంలో అంకెలను వేయాలి. ఒకటి అంకె వేయకుండా మిగతా అంకెలు వేసినా, అంకెను అక్షరాల్లో రాసినా, టిక్కు, ఇన్‌టూ మార్కు పెట్టినా, సంతకం, ఇతర గుర్తులు వేసినా చెల్లుబాటు కావు.
మార్కులేయనున్న మాస్టర్లు
Published Sun, Mar 22 2015 1:45 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement