- రేపు మదనపల్లె డివిజన్‌లో తొలి విడత స్థానిక ఎన్నికలు
- సన్నద్ధమైన యంత్రాంగం
- 31 జెడ్పీటీసీలు, 447 ఎంపీటీసీలకు పోలింగ్
- బరిలో 1408 మంది అభ్యర్థులు
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్ : జిల్లాలో తొలి విడతగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. 6వ తేదీన జిల్లాలో తొలి విడతగా మదనపల్లె డివిజన్ లోని 31 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 144 మంది జెడ్పీటీసీ స్థానాలకు, 1264 మంది ఎంపీటీసీ స్థానాల్లో పోటీ పడుతున్నారు. 10.77 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించనుకోనుండగా, మొత్తం 1408 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
పోలింగ్ మండలాలు ఇవే...
మదనపల్లె డివిజన్ పరిధిలోని 31 మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ డివిజన్‌లో బి.కొత్తకోట జెడ్పీటీసీ స్థానంతోపాటు 17 ఎంపీటీసీ సెగ్మెంట్లకు బెరైడ్డిపల్లెలో 16, చిన్నగొట్టిగల్లు 7, చౌడేపల్లె 12, గంగవరం 16, గుడుపల్లె 13, గుర్రంకొండ 12, కంభంవారిపల్లె 12, కలకడ 10, కలికిరి 14, కుప్పం 34, కురబలకోట 12, ములకలచెరువు 13, మదనపల్లె రూరల్ 27, నిమ్మనపల్లె 9, పలమనేరు 9, పెద్దమండ్యం 10, పెద్దపంజాణి 17, పెద్దతిప్పసముద్రం 15, పీలేరు 21, పుంగనూరు 16, రామకుప్పం 16, రామసముద్రం 14, రొంపిచెర్ల 8, శాంతిపురంలో 18, సదుం 10, సోమల 12, తంబళ్లపల్లె 11, వాల్మీకిపురం 13, వి.కోట 25, ఎర్రావారిపాళెంలోని 8 ఎంపీటీసీ సెగ్మెంట్లతో పాటు జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
7 వేలకు పైగా సిబ్బంది
తొలి విడత ఎన్నికలకు మొత్తం 7,742 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ముగ్గురు సిబ్బందిని నియమించారు. 1,550 మంది పీవోలు, 1,550 మంది ఏపీవోలు, 4,642 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 1.381 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 141 సమస్యాత్మక, 152 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు న్నాయి. ఇక్కడ పోలింగ్ సవ్యంగా నిర్వహించడానికి 146 మంది వీడియోగ్రాఫర్లు, లైవ్ వెబ్‌కాస్టింగ్‌కు 140 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 99 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సిబ్బంది కోసం 347 బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
బ్యాలెట్ పత్రాలతో తీర్పు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్లు వారి నిర్ణయాన్ని బ్యాలెట్ పత్రాల ద్వారా తెలియజేయనున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన గుర్తులతో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. మదనపల్లె డివిజన్‌లో 31 మంది జెడ్పీటీసీ అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి 12.95 లక్షల బ్యాలెట్ పత్రాలు, 447 మంది ఎంపీటీసీ అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి 17.61 లక్షల బ్యాలెట్ పత్రాలు ముద్రించి ఇప్పటికే వాటిని ఆయా పోలింగ్ కేంద్రాల సమీపంలోని మండల కేంద్రాలకు తరలించారు.