స్థానిక’ తేదీలు ఖరారు
- 6న మదనపల్లె డివిజన్
- 11న చిత్తూరు, తిరుపతి డివిజన్లు
- మే 16 తరువాత ఓట్ల లెక్కింపు?
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు తేదీలు ఖరారయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 6, 11వ తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ పోలింగ్ నిర్వహించాలనే విషయంపై గురువారం కూడా అధికారులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు.
దీంతో శుక్రవా రం జెడ్పీ సీఈవో వేణుగోపాలరెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి పోలింగ్ తేదీలపై వివరణ ఇవ్వడం తో జిల్లా కలెక్టర్ వీటిని ఆమోదించారు. ముం దుగా అనుకున్నట్లుగానే మదనపల్లె డివిజన్‌లో ఏప్రిల్ 6న, చిత్తూరు, తిరుపతి డివిజన్లలో ఏప్రిల్ 11న జెడ్పీటీసీ, ఎంపీటీపీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ రాంగోపాల్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. ఎన్నికల సంఘం సైతం దీన్ని వెంటనే ఆమోదించడంతో ఇక సవ్యంగా పోలింగ్ నిర్వహించడం ఒక్కటే మిగిలింది.
మదనపల్లెలో తొలి విడత
జిల్లాలో రెండు విడతలుగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలివిడతగా మదనపల్లె డివిజన్‌లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6న మదనపల్లె డివిజన్ పరిధిలోని బి.కొత్తకోట, బెరైడ్డిపల్లె, చిన్నగొట్టిగల్లు, చౌడేపల్లె, గంగవరం, గుడుపల్లె, గుర్రంకొండ, కంబంవారిపల్లె, కలకడ, కలికిరి, కుప్పం, కురబలకోట, ములకలచెరువు, మదనపల్లె (రూరల్), నిమ్మనపల్లె, పలమనేరు, పెద్దమండ్యం, పెద్దపంజాణి, పెద్దతిప్పసముద్రం, పీలేరు, పుంగనూరు, రామకుప్పం, రామసముద్రం, రొంపిచెర్ల, శాంతిపురం, సదుం, సోమల, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, వి.కోట, ఎర్రావారిపాళెం మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 11న రెండో విడత
ఇక రెండో విడతలో చిత్తూరు, తిరుపతి డివిజన్ల పరిధిలోని ఎన్నికలు నిర్వహిస్తారు. చిత్తూరు డివిజన్‌లోని బంగారుపాళెం, చిత్తూరు, గంగాధరనెల్లూరు, గుడిపాల, ఐరాల,రామచంద్రాపురం, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం,పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఎస్.ఆర్.పురం,తవణంపల్లె, వడమాల పేట, వెదురుకుప్పం, విజయపురం, యాదమరి మండలాల్లో ఏప్రిల్ పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే తిరుపతి డివిజన్‌లోని బుచ్చినాయుడుకండ్రిగ, చంద్రగిరి, కేవీబీపురం, నాగలాపురం, పాకాల, పిచ్చాటూరు, పులిచెర్ల,రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి రూరల్, వరదయ్యపాళెం, ఏర్పేడు మండలాల్లో సైతం ఇదే రోజు పోలింగ్ జరుగుతుంది.
50 లక్షల బ్యాలెట్ పత్రాలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ సారి కూడా బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించనున్నారు. ఇందు కోసం దాదాపు 12 టన్నుల కాగితాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక్కో టన్నుకు 2 లక్షలకు పైగా బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే డివిజన్ల వారీగా ముద్రిస్తున్నారు. జిల్లాలోని 65 జెడ్పీటీసీ, 901 ఎంపీటీసీ స్థానాలకు దాదాపు 50 లక్షల బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నారు. అయితే 901 ఎంపీటీసీ స్థానాల్లో 14 ఏకగ్రీమవడంతో 887 సెగ్మెంట్లలో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 22 లక్షల మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జెడ్పీటీసీ బరిలో 65 స్థానాలకు 266 మంది ఉండగా, 887 ఎంపీటీసీ స్థానాల్లో 2414 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు వాయిదా
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రకటించకూడదని అధికారులు నిర్ణయించారు. మే 7 తరువాత ఎన్నికల ఫలితాలు వెల్లడించొచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 16 తరువాత ఓట్ల లెక్కింపు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.