ఎస్సీ, ఎస్టీ హక్కులను కాలరాస్తారా? | What about SC, STs Rights? | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ హక్కులను కాలరాస్తారా?

Published Fri, Sep 23 2016 11:59 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

– ఈ జిల్లాలో పాలనా వ్యవస్థ నడుస్తోందా?
– ఎవరి ఇష్టప్రకారం వాళ్లు వ్యవస్థను నడుపుతారా?
– ప్రజాస్వామ్యంలో ఉన్నామా... పాకిస్తాన్‌లో ఉన్నామా?
– కలెక్టర్‌ తీరుపై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆగ్రహం
– సారీ.. చెవిరెడ్డి గారూ.. అంటూ క్షమాపణ చెప్పిన కలెక్టర్‌
సాక్షి, చిత్తూరు: జిల్లాలో చట్టాలు, జీవోలు, రూల్స్‌ అమలవుతున్నాయా... అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ను ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి కలెక్టర్‌ తీరును దుయ్యబట్టారు. ‘ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, ఆస్తుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలు, జీవోలను అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్‌గా మీది కాదా’ అని ఆయన ప్రశ్నించారు. ‘మీ ఆలోచనలే చట్టాలు, మీ నిర్ణయాలే జీవోలు అన్నట్లు వ్యవహరిస్తే కుదరదు’ అంటూ ఆయన ఫైర్‌ అయ్యారు. చివరకు ప్రజాప్రతినిధులకు ఇచ్చిన మినిట్స్‌ బుక్‌ కూడా తప్పుల తడకగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎక్కడైనా పోలీస్‌ స్టేషన్‌కు ఒక ఫిర్యాదు వస్తే  పోలీసులు నేరుగా అయితే సెక్షన్‌ 154, కోర్టు ఆదేశాల మేరకు అయితే 156 కింద రిజిస్టర్‌ చేస్తారని.. సెక్షన్‌ 161, 164 ప్రకారం కేసులు రిజిస్టర్‌ చేస్తున్నారన్నట్లు మినిట్స్‌లో ఇచ్చారని ఇది ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ‘దేశంలో ఎక్కడైనా సెక్షన్‌ 161, 164 ప్రకారం స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తారు, ఆ మాత్రం లీగల్‌ పరిజ్ఞానం లేకుండా ఎలాబడితే అలా సంతకం చేసి మరీ మినిట్స్‌ ఇస్తారా’ అని కలెక్టర్‌పై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ ‘తెలియక తప్పు జరిగిందని, ఇక అలా జరగకుండా చూసుకుంటామని, జరిగిన పొరపాటుకు క్షమించాలని’ కోరారు.  మండల స్థాయి అధికారులు వారానికి ఒకరోజు ఒక ఎస్టీ గ్రామంలో పర్యటించి, అంటరానితనం నిర్మూలనకు కృషి చేయాలని చట్టాలు చెబుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెవిరెడ్డి కలెక్టర్‌ను ప్రశ్నించారు. జిల్లా కలెక్టరే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిని నిర్లక్ష్యం చేస్తే ఎలా అన్నారు.  తహశీల్దార్, ఆర్టీవో, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌ సెల్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇది సహేతుకం కాదన్నారు.  ప్రజలకు అమూల్యమైన సేవలు అందించాల్సిన మీరే నిబంధనలు కాలరాస్తుంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. పాకిస్తాన్‌లో ఉన్నామా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. జిల్లా, డివిజన్, మండల కమిటీలు వేయలేనివారు జిల్లా పరిపాలన ఎలా చేస్తారని ఎద్దేవా చేశారు. వచ్చిన రెండేళ్ల కాలంలో 10 మీటింగులు జరిగి ఉండాలని, కానీ నాలుగు మీటింగ్‌లే పెట్టడాన్ని బట్టే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని తెలలుస్తోందన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  లేవనెత్తిన అంశాలను సభకు హాజరైన ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు సమర్థిస్తూ ఇలాగే మా హక్కులను కాలరాస్తే ఉద్యమాలు చేయాల్సి వస్తుందని కలెక్టర్‌ను హెచ్చరించారు. చట్టాలు పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదని, పూర్తి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ అన్నారు.
పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ కంటతడి
శుక్రవారం జరిగిన మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ కంటతడి పెట్టారు. మండల పరిషత్‌ సమావేశంలో అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి కులం పేరుతో దూషిస్తే ఇప్పటికే చర్యలు ఎందుకు చర్యలు తీసుకోలేదని సునీల్‌ ఎస్పీ శ్రీనివాస్‌ను అడిగారు. పోలీసుల చర్యలు కులం, పార్టీ ప్రాతిపాదికనే ఉంటాయా అని ప్రశ్నించారు. ఓ ఎమ్మెల్యేపై దాడికి యత్నించి కొన్ని నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోనందుకు సిగ్గుపడాలని సునీల్‌ అన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు.. సామాన్య ఎస్సీలకు రక్షణ ఎలా ఉంటుందని ఎస్పీని భాస్కర్‌రెడ్డి, నారాయణ స్వామి నిలదీశారు. అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశారు. సభ నుంచి వాకౌట్‌ చేసే ముందు పోలీసులు వ్యవహరించిన తీరును వివరిస్తూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ కంటతడి పెట్టారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement