టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న సీఐటీయూ జాతీయ నేత శ్రీనివాసరావు
తిరుపతి అర్బన్: టీటీడీలో పనిచేస్తున్న 14వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్కలేదా..? అని సీఐటీయూ జాతీయ నేత వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం చేపట్టిన ‘సమరభేరి’ కార్యక్రమానికి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ పరిపాలనా భవనం ముందు నిర్వహించిన ధర్నాలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వల్లే అత్యధిక శాతం పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే వారి కష్టానికి తగిన వేతనం ఇవ్వడం లేదన్నారు. టీటీడీలో కొనసాగుతున్న కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పేరును అడ్డుపెట్టుకుని కార్మికులపై అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పొట్టగొట్టే వర్క్ కాంట్రాక్ట్ విధానాన్ని టీటీడీలో రద్దు చేయాలని కోరారు. ఎన్నిసార్లు పోరాటాలు చేసినా టీటీడీలో చలనం రానందువల్లే ఈనెల 15తో డెడ్‌లైన్ ఇచ్చి నిరవధిక ఆందోళనలకు సన్నద్ధం అయ్యామని ప్రకటించారు. ధర్నాలో భాగంగా కళాకారులు శ్రీవారి పాటలు, నామ సంకీర్తనలు ఆలపించి నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ కార్యదర్శి గోల్కొండ వెంకటేశం, నాయకలు మునిరాజా, నాగార్జున, గోపీనా«థ్, మోహన్‌రావు, ఈశ్వర్‌రెడ్డి, వాసు, చంద్రశేఖర్, గంగులప్ప, వెంకటయ్య, మురళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment