ఉపాధి పనిముట్ల దొంగతనం పై విచారణ కమిటీ వేయాలని కోరుతున్న ఎమ్మెల్యే నారాయణస్వామి
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లా పరిషత్ పాలకవర్గంపై అసంతృప్తి సెగలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పాలకవర్గం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా గ్రామాల్లో అభివృద్ధి పనులు, సభ్యుల సమస్యలను పరిష్కరించకపోవడంతో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు స్థాయి సంఘ సమావేశాలకు హాజరుకావడం లేదు. జిల్లాపరిషత్ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఇన్‌చార్జి సీఈఓ రవికుమార్‌నాయుడి అధ్యక్షతన 1 నుంచి 7 స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో 3 (వ్యవసాయం కమిటీ), 5 (స్త్రీ, శిశు సంక్షేమ శాఖ) కమిటీలకు కోరం లేకపోవడంతో వాయిదాపడ్డాయి. మొదట ప్రారంభమైన 1, 7 కమిటీల సమావేశంలో జీఎస్టీ సమస్య ఎక్కువగా ఉందని అనేక సార్లు సమావేశాల్లో చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పాలసముద్రం జెడ్పీటీసీ చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జెడ్పీ కార్యాలయంలో గణాంకశాఖాధికారి వెంకటరత్నాన్ని నిధుల వివరాలను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారన్నారు.
అధికారుల తీరు మార్చుకోవాలన్నారు. నాణ్యత లేని రోడ్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని అధికార పార్టీ కలకడ జెడ్పీటీసీ తిరుమలనాయుడు సమావేశంలో తేల్చి చెప్పారు. పెండింగ్‌లో ఉన్న నీరు–చెట్టు నిధులు రూ.13 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని మట్టిరోడ్లను బీటీ రోడ్లగా మార్చాలని ఆదేశాలు వచ్చాయని అధికారులు చెప్పారు. అందుకోసం జిల్లాలో నాబార్డు నుంచి ఫేజ్ –1 లో 13 రోడ్లకు రూ.34.55 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. 6వ కమిటీ చైర్‌పర్సన్ తిరుపతి రూరల్ జెడ్పీటీసీ సుహాసినీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులకు రుణాల కింద అందించే పాడి ఆవులు కేవలం కమిటీల ఆదేశాల మేరకే అందించడం జరుగుతోందన్నారు. కమిటీ, వెటర్నరి డాక్టర్లు కుమ్ముకై రైతులను మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ ఒక సీనియర్ ఆఫీసర్‌ను నియమించి పర్యవేక్షించాలని తీర్మానం చేశారు. కలికిరి జెడ్పీటీసీ మాలతి మాట్లాడుతూ ప్రజలకు బ్యాంకర్లు రుణాల సబ్సిడీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చంద్రన్న పెళ్లికానుక పథకంలో మార్పులు చేసి జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటక, తమిళనాడుల నుంచి పెళ్లిళ్లు చేసుకునే వారికి ఆ పథకం వర్తించేలా చూడాలని సభ్యులు కోరారు. ఎర్రావారిపాళ్యం జెడ్పీటీసీ కుమారస్వామి, తిరుపతి రూరల్ జెడ్పీటీసీ సుహాసిని మాట్లాడుతూ తమ మండలంలో ఎస్సీ కమ్యూనిటీ హాలును మంజూరు చేయాలని కోరారు.
పనిముట్లు చోరీకి గురైనాపట్టించుకోవడం లేదు..
గంగాధరనెల్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో రైతుల కోసం మంజూరు చేసిన పనిముట్లు సోమవారం రాత్రి చోరీకి గురయ్యాయని వైఎస్సార్‌సీపీ జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు. ఆ పనిముట్లను స్థానికంగా ఉన్న అధికారపార్టీ నేతలు కొందరు తీసుకెళ్తున్నట్లు స్థానికులు చూసి తన దృష్టికి సమస్యను తీసుకొచ్చారన్నారు. ఆ విషయంపై అక్కడి పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెళ్తే వారు ఏమాత్రం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. పై నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని, తాము ఏమీ చేయలేమని పోలీసులే సమాధానమిస్తే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. ఈ విషయంపై డ్వామా పీడీ కుర్మానాథ్, సీఈఓ రవికుమార్ విచారణ చేసి న్యాయం జరిగేలా చూడాలన్నారు. పేదలు బాగుపడాలంటే ఆఫీసర్లు బాగుండాలని.. నిజాయితీగా విచారణ చేసి న్యాయం జరిగేలా చూడాలని ఆయన జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణిని కోరారు. జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వారు తీసుకెళ్లే ట్రాక్టర్ల బాడుగకు కూడా డబ్బులు రావడం లేదని చెప్పారు. తోతాపురి రకం మామిడికి ప్రాసెసింగ్ యూనిట్లకు ఇచ్చిన విధంగానే ప్రైవేటు మార్కెట్‌లలో కూడా కిలోకు రూ.7.50 ధరను నిర్ణయించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment