సమీక్షిస్తే ఒట్టు
- టీడీపీ ఆదేశాలు పట్టని నేతలు
- తూతూమంత్రంగా కొన్నిచోట్ల సమావేశాలు
- గెలుపోటములను విశ్లేషించని వైనం
- నేడు చిత్తూరులో జిల్లా కార్యవర్గ సమావేశం
సాక్షి, తిరుపతి : జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సీమాంధ్ర రాష్ట్రంలో అధికారం దక్కిందన్న జోష్‌లో ఉన్నాయి. ఈ ఆనందంలో పార్టీ ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి గెలుపోటములను విశ్లేషించాలని పార్టీ ఆదేశించింది. ఆ మేరకు అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను కూడా నియమించారు. సమీక్షించిన అంశాలను జిల్లా కార్యవర్గసమావేశంలో అందజేయాలని సూచిం చారు.
రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాలు, సూచనలను జిల్లా నాయకులు చెవికెక్కించుకోలేదు. సగానికి పైగా నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించలేదు. జిల్లా కేంద్రం చిత్తూరులో శనివారం పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సమీక్ష సమావేశాల నివేదికను అందజేయాల్సి ఉంది. చాలా నియోజకవర్గాల్లో సమీక్షలు జరగకపోవడంతో ఈ సమావేశం రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తల కృషిని అభినందించేందుకు మాత్రమే పరిమితం కానుంది.
జిల్లాలో పూతలపట్టు, నగరి, సత్యవేడు, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు నియోజకవర్గాల్లో మాత్రమే సమీక్షలు జరిగాయి. ఈ సమావేశాల్లోనూ పూతలపట్టు మినహాయిస్తే మిగిలిన చోట్ల గెలుపోటములకు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విశ్లేషించిన దాఖలాలు లేవు. శ్రీకాళహస్తి, తిరుపతి,కుప్పం నియోజకవర్గాల్లో మంచి ఆధిక్యం రావడంతో ఆ పార్టీ నేతలు సమీక్షల కంటే కార్యకర్తలను అభినందించుకునే పనిలో ఉన్నారు.
సీనియర్ నేతలు గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ పోటీ చేసిన చంద్రగిరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఓటమికి కొందరు ముఖ్యనేతల వెన్నుపోట్లు కూడా కారణమని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ సమీక్షలు జరపలేదు. ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థులు ఓట్ల లెక్కింపు తరువాత కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు.
పీలేరు నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీతో కుమ్మక్కు ప్రధాన కారణమని తెలిసినప్పటికీ అక్కడ కూడా సమీక్ష చేసే సాహసం చేయలేదు. పలమనేరులో ఓడిపోయిన అభ్యర్థి సుభాష్‌చంద్రబోస్ మండలాలవారీగా నేతలను పిలిపించుకుని బూత్‌లవారీగా పార్టీకి వచ్చిన ఓట్లపై ఆరా తీశారు. నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయలేదు.
నగరి నియోజకవర్గంలో సీనియర్ నేత ముద్దుకృష్ణమనాయుడు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఓటమికి ఎవరినీ నిందించడం లేదని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినందున కార్యకర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి సమావేశం ముగిం చారు. పొత్తులో భాగంగా మదనపల్లెను బీజేపీకి కేటాయించడమే ఓటమికి దారితీసిందని ఆ నియోజకవర్గ నేతలు అభిప్రాయపడ్డారు.
ఇక్కడ బీజేపీ బలం నాలుగు వేల ఓట్లకు మించదని, ఈ ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు రావడం వెనుక కార్యకర్తల కృషి ఉందని విశ్లేషించారు. తంబళ్లపల్లెలో సమీక్షపేరుతో సమావేశం ఏర్పాటు చేసి అభినందన సభగా మార్చారు. పుంగనూరులో అసలు సమీక్ష జరపలేదు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ నాయకులు రాజధానికి వెళ్లడంతో ఇక్కడ కూడా సమీక్ష జరగలేదు.