చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను చంద్రగిరి నుంచి పోటీ చేయబోనని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడును కలిసిన ఆమె తన మనసులోని మాటను వెల్లడించిన ట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం సరైన నాయకుడికి బాధ్యతలు అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానికి చంద్రగిరి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి రాజగోపాలనాయుడు ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగారు. ఆ తరువాత వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకున్న అరుణకుమారి దాదాపు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండుసార్లు మంత్రిగా కొనసాగిన గల్లా అరుణకుమారి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకుని చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పట్లో డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలై ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆమె పార్టీ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నియోజకవర్గంలో ఏర్పడ్డ గ్రూపు రాజకీయాలు గల్లాను ఇబ్బంది పెట్టాయి. ఒకవైపు మంత్రి నారా లోకేష్, మరో వైపు ఎంపీ శివప్రసాద్ తమదైన శైలిలో రాజకీయాన్ని మొదలు పెట్ట డంతో గల్లాకు రాజకీయంగా కేడర్‌లో ప్రాధాన్యత తగ్గింది.
ప్రతి పనికీ మండల స్థాయి పార్టీ నాయకులు నేరుగా లోకేష్ దగ్గరకు వెళ్లడం పనులు చేయించుకోవడం మొదలైంది. అభివృద్ధి పనులు, జన్మభూమి కమిటీలు, బదిలీలకు సంబంధించిన పనుల కోసం ఎక్కువమంది పార్టీ నాయకులు ఎంపీ శివప్రసాద్‌నో, మంత్రి లోకేష్‌ను కలుస్తున్నారు. దీనికితోడు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడం, వారి సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తుండడంతో వివిధ గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను చంద్రగిరి నుంచి పోటీ చేయడం మంచిది కాదన్న ఆలోచనతో ఇన్‌చార్జి బాధ్యతలకు గల్లా గుడ్‌బై చెప్పినట్లు సమాచారం. దీనికితోడు ఆమె నేడో రేపో అమెరికా వెళ్లి అక్కడ కొన్నాళ్ల పాటు ఉండాలని యోచిస్తోన్నట్లు తెల్సింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరుణకుమారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన కుమార్తె రమాదేవి కూడా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేరన్న విషయాన్ని గల్లా అరుణ సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంపీ గల్లా జయదేవ్ యథావిధిగా గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని, మళ్లీ ఇంతమంది ఎందుకన్న భావనలో ఆమె ఉన్నారని కొందరు చెబుతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ 2019లో చంద్రగిరి నుంచి గల్లా అరుణ పోటీ ఉండదని మాత్రం సుస్పష్టమైంది.
పులివర్తి నానికి ఇన్‌చార్జి బాధ్యతలు...?
ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పులివర్తి నానికి చంద్రగిరి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన నాని ఏడాది కాలంగా మంత్రి లోకేష్‌తో సన్నిహితంగా మెలుగుతూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా చంద్రగిరి బాధ్యతలు చేపట్టే వీలుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment