jai samaikya andhra
-
సమీక్షిస్తే ఒట్టు
టీడీపీ ఆదేశాలు పట్టని నేతలు తూతూమంత్రంగా కొన్నిచోట్ల సమావేశాలు గెలుపోటములను విశ్లేషించని వైనం నేడు చిత్తూరులో జిల్లా కార్యవర్గ సమావేశం సాక్షి, తిరుపతి : జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సీమాంధ్ర రాష్ట్రంలో అధికారం దక్కిందన్న జోష్‌లో ఉన్నాయి. ఈ ఆనందంలో పార్టీ ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి గెలుపోటములను విశ్లేషించాలని పార్టీ ఆదేశించింది. ఆ మేరకు అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను కూడా నియమించారు. సమీక్షించిన అంశాలను జిల్లా కార్యవర్గసమావేశంలో అందజేయాలని సూచిం చారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాలు, సూచనలను జిల్లా నాయకులు చెవికెక్కించుకోలేదు. సగానికి పైగా నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించలేదు. జిల్లా కేంద్రం చిత్తూరులో శనివారం పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సమీక్ష సమావేశాల నివేదికను అందజేయాల్సి ఉంది. చాలా నియోజకవర్గాల్లో సమీక్షలు జరగకపోవడంతో ఈ సమావేశం రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తల కృషిని అభినందించేందుకు మాత్రమే పరిమితం కానుంది. జిల్లాలో పూతలపట్టు, నగరి, సత్యవేడు, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు నియోజకవర్గాల్లో మాత్రమే సమీక్షలు జరిగాయి. ఈ సమావేశాల్లోనూ పూతలపట్టు మినహాయిస్తే మిగిలిన చోట్ల గెలుపోటములకు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విశ్లేషించిన దాఖలాలు లేవు. శ్రీకాళహస్తి, తిరుపతి,కుప్పం నియోజకవర్గాల్లో మంచి ఆధిక్యం రావడంతో ఆ పార్టీ నేతలు సమీక్షల కంటే కార్యకర్తలను అభినందించుకునే పనిలో ఉన్నారు. సీనియర్ నేతలు గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ పోటీ చేసిన చంద్రగిరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఓటమికి కొందరు ముఖ్యనేతల వెన్నుపోట్లు కూడా కారణమని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ సమీక్షలు జరపలేదు. ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థులు ఓట్ల లెక్కింపు తరువాత కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. పీలేరు నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీతో కుమ్మక్కు ప్రధాన కారణమని తెలిసినప్పటికీ అక్కడ కూడా సమీక్ష చేసే సాహసం చేయలేదు. పలమనేరులో ఓడిపోయిన అభ్యర్థి సుభాష్‌చంద్రబోస్ మండలాలవారీగా నేతలను పిలిపించుకుని బూత్‌లవారీగా పార్టీకి వచ్చిన ఓట్లపై ఆరా తీశారు. నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయలేదు. నగరి నియోజకవర్గంలో సీనియర్ నేత ముద్దుకృష్ణమనాయుడు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఓటమికి ఎవరినీ నిందించడం లేదని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినందున కార్యకర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి సమావేశం ముగిం చారు. పొత్తులో భాగంగా మదనపల్లెను బీజేపీకి కేటాయించడమే ఓటమికి దారితీసిందని ఆ నియోజకవర్గ నేతలు అభిప్రాయపడ్డారు. ఇక్కడ బీజేపీ బలం నాలుగు వేల ఓట్లకు మించదని, ఈ ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు రావడం వెనుక కార్యకర్తల కృషి ఉందని విశ్లేషించారు. తంబళ్లపల్లెలో సమీక్షపేరుతో సమావేశం ఏర్పాటు చేసి అభినందన సభగా మార్చారు. పుంగనూరులో అసలు సమీక్ష జరపలేదు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ నాయకులు రాజధానికి వెళ్లడంతో ఇక్కడ కూడా సమీక్ష జరగలేదు. -
ముసుగుతొలగింది..
‘సమైక్యత’ మాటున ఏం చేసినా చెల్లుబాటవుతుందని అనుకుంటున్నారు రాజమండ్రి, విజయవాడ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్! ఆ నినాదాన్ని తమ అవకాశవాదానికి ముసుగుగా నిస్సిగ్గుగా వాడుకోవాలనుకుంటున్నారు. నిన్న రాజకీయంగా అస్త్రసన్యాసం చేసినట్టు ప్రకటించి, నేడు కొత్త పార్టీకి అస్త్రశస్త్రాలు సమకూర్చే వారి అవతారం ఎత్తినా.. ఫర్వాలేదనుకుంటున్నారు. అయితే.. అలాంటి ఊసరవెల్లులకు చుక్కెదురు కాక తప్పదంటున్నారు సీమాంధ్రులు! సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ర్ట విభజన నిర్ణయంతో హతాశులైనట్టు కనిపించారు రాజమండ్రి, విజయవాడ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్. తమకు రాజకీయాలంటేనే విరక్తి పుట్టినట్టు ప్రకటించారు. ఇంతలోనే తమ పలుకులను విస్మరించి, జనం ఏమనుకుంటారోనన్న జంకూగొంకూ లేకుండా, నిస్సిగ్గుగా సమైక్యాంధ్ర కోసమంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రెండు రోజుల్లో రాజమండ్రిలో ప్రకటించే రాజకీయ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ తామేగా మారిపోయారు. విభజన బిల్లును ఆమోదిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని జబ్బలు చరిచి మరీ ప్రకటించారు లగడపాటి. ‘టి’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడి, అపాయింటెడ్ డే కూడా ప్రకటించేసిన తరుణంలో ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో ఏర్పాటు కానున్న పార్టీకి ఆ ఇద్దరూ దగ్గరుండి జెండా, అజెండాలను రూపొందించే పనిలో నిమగ్నం కావడాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కిరణ్ ఆధ్వర్యంలో పార్టీ ఏర్పాటు విషయం తెర మీదకు వచ్చిన దగ్గర నుంచి తెరవెనుక పనులు చక్కబెడుతూ ఉండవల్లి పెద్దన్నయ్య పాత్ర పోషిస్తూ వచ్చారు. కిరణ్‌కు తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చిన ఉండవల్లి ఏ పార్టీలో చేరేది లేదన్నారు. తీరా సోమవారం కిరణ్ హైదరాబాద్‌లో ప్రకటించిన పార్టీ తాత్కాలిక కమిటీ ఉపాధ్యక్షుల జాబితాలో ఉండవల్లి ఉండటం గమనార్హం. దీంతో ఉండవల్లి రాజకీయాలకు దూరంగా ఉంటానని గత మూడు నెలలుగా వేసుకున్న ముసుగు తొలగిపోయిందని సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. ఇక రాజకీయ సన్యాసమన్న లగడపాటి.. కిరణ్ పెట్టబోయే పార్టీ తాత్కాలిక కమిటీ సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్లమెంటుకు బిల్లు వచ్చినప్పుడు పెప్పర్ స్ప్రేతో హడావిడి చేసిన లగడపాటి కొత్తపార్టీలో కొత్త అవతారమెత్తారని జనం విమర్శిస్తున్నారు. ఆ వైరాగ్యం ముందస్తు వ్యూహమే.. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో రాజమండ్రి నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఉండవల్లి కాంగ్రెస్‌లో మేధావి వర్గ ప్రతినిధిగా, ఆ పార్టీ అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్నారు. అలాంటి ఉండవల్లి రాజమండ్రిలో పత్రికా సమావేశం నిర్వహించి, రాజకీయ వైరాగ్యం ప్రకటించి మిగిలిన జీవితమంతా కలం, కాగితంతో కాలక్షేపం చేస్తానని చెప్పుకున్నారు. మూడు నెలలు కూడా తిరగకుండానే మాట తప్పి కిరణ్ కోటరీలో కొత్త అవతారమెత్తారని సీమాంధ్ర జనం ఆక్షేపిస్తున్నారు. రాజకీయాలు విడిచిపెట్టే ఉద్దేశమే లేనప్పుడు జనవరిలో రాజకీయాలపై వైరాగ్యం ప్రకటించడమెందుకు, ఇప్పుడు కిరణ్ పార్టీతో అంటకాగడమెందుకని సమైక్యవాదులు మండిపడుతున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న ఉండవల్లి పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలపై వైరాగ్యం ప్రకటించినప్పుడే అదంతా ముందస్తు వ్యూహంలో భాగమనే అనుమానం కాస్తా ఇప్పుడు నిజమైంది. సమైక్యవాదులను చితకబాదిన‘హర్ష’ కుమారులు.. ఇదంతా ఒక ఎత్తై కిరణ్‌కుమార్‌రెడ్డి రాజమండ్రిలో ఈ నెల 12న ప్రకటించే పార్టీకి తెలుగువారి ఆత్మగౌరవమే నినాదమని అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ తదితరులు ప్రకటించారు. విభజన విషయంలో ఆది నుంచి హర్షకుమార్ పలు విమర్శలను ఎదుర్కొన్నారు. మొదట్లో ‘జై ఆంధ్ర’ ఉద్యమ వాదినని, తెలంగాణ ను విభజించాలని డిమాండ్ చేశారు. జనం నుంచి ప్రతిఘటన ఎదురై, గత్యంతరం లేకసమైక్యాంధ్రకు మద్దతన్నారు. అప్పుడైనా చిత్తశుద్ధితో కృషి చేశారా అంటే అదీ కూడా లేదని సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. ఇందుకు గతేడాది అక్టోబర్ 5న తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా రాజమండ్రి పేపర్మిల్ను మూయించివేసేందుకు అక్కడకు వెళ్లిన సమైక్యవాదులు హర్షకుమార్కు చెందిన కళాశాల బోర్డును చింపడం, రోడ్డును దిగ్బంధించగా.. ఎంపీ తనయులు శ్రీరాజ్, సుందర్‌లు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత ప్రమోద్‌కుమార్, పేపర్‌మిల్ ఉద్యోగి దుర్గాప్రసాద్ తదితరులపై తరిమి, తరిమి కర్రలతో దాడి చేసినప్పుడే హర్షకుమార్ చిత్తశుద్ధిపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి హర్షకుమార్, ఇక రాజకీయాల్లోనే ఉండమన్న ఉండవల్లి, లగడపాటి ఎన్ని వ్యూహాలు పన్నినా సీమాంధ్రలో నిన్నమొన్నటి వరకు వెంట ఉన్న ఎమ్మెల్యేలే వారిపై నమ్మకం లేక దూరమైపోయారు. ఇక సీమాంధ్ర ప్రజలు వారిని ఎలా నమ్ముతారని వారి అనుచరులే విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలపై లగడపాటి, ఉండవల్లి సన్యాసం, వైరాగ్యం ప్రచార ఆర్భాటమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విభజన విషయంలో కూడా ఇదే రీతిలో వ్యవహరించబట్టే అధిష్టానం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదని అంటున్నారు. వారంతా సమైక్యవాదులను గుడ్డలు ఊడదీసి తంతామన్న వారే.. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెడుతున్న ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని జిల్లాలో దగ్గరుండి నడిపిస్తున్న వారు ఒకప్పుడు సమైక్య వాదులను గుడ్డలు ఊడదీసి తంతాం, ఉద్యోగులను తరిమి కొడతామని బెదిరించిన వారే. ఉండవల్లి సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేసిన సభలో తాను ఇక పార్లమెంటుకు వెళ్లనన్నారు. కానీ మర్నాటి నుంచే నెల పాటు సమావేశాల్లో పాల్గొన్నారు. రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాల్సిన సమయంలో ఈ ఎంపీలు అందరూ అధిష్టానానికి పాదాభివందనాలు చేశారు. ప్రజా ఉద్యమం ముమ్మరంగా సాగుతున్నప్పుడు ప్రజల్లోకి రాకుండా ఇంటి వద్ద పోలీసు కాపలాలు పెట్టించుకున్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. విభజన జరిగిపోతున్న తీరుతో ప్రజలు కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందు వల్ల రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీని వీడి డ్రామాలాడుతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యం కోసం రాజీనామా చేశారన్నప్పుడు జనం నమ్మారు. ఇప్పుడు అంతా అయిపోయాక పారీ ్టపెట్టడంతో ఈ సానుభూతి కూడా పూర్తిగా పోయింది. ఈ కొత్త సీసాలో పాత సారాను జనం నమ్మే పరిస్థితిలో లేరు. - ముప్పాళ్ల సుబ్బారావు, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్, రాజమండ్రి -
పార్టీ ‘జై సమైక్యాంధ్ర’... గుర్తు ‘చెప్పు’
కిరణ్ కొత్త పార్టీ తెరవెనుక వ్యూహకర్తలు టీడీపీ మాజీ ఎంపీలు సాక్షి, హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా మాచవరం చిరునామాతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఇదివరకే రిజిస్టర్ చేసిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని తీసుకొని కొనసాగించాలని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పేరుతో పార్టీని రిజిస్టర్ చేసింది టీడీపీ మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరిరావు. ఈయనతో పాటు మరో మాజీ ఎంపీ చిట్టూరు రవీంద్ర కూడా ఈ పార్టీకి సంబంధించిన కసరత్తులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరూ తోడళ్లుల్లు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు చుండ్రు శ్రీహరి వియ్యంకుడు. వీరిద్దరితో పాటు ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ సూచనల మేరకు తొలి సభను రాజమండ్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొత్త పార్టీకి సంబంధించిన జెండాలు, ఇతర ప్రచార సామగ్రి తయారీ పూర్తయిందని, ఈనెల 12న రాజమండ్రిలో జరిగే సభలో టీడీపీకి చెందిన ఈ మాజీ ఎంపీలతోపాటు మరి కొంతమంది నాయకులు పాల్గొంటారని తెలుస్తోంది. ఇలా ఉండగా కిరణ్ కొత్తపార్టీ ప్రకటించిన సమయంలో ఆయన వెంట కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు లేరు. మీడియా సమావేశం అనంతరం ఆయన కిరణ్‌ను కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ కిరణ్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. -
విరామమెరుగుని సీమాంధ్ర పోరు
సాక్షి నెట్వర్క్: అరవై ఒక్క రోజులుగా అలుపెరుగని సమైక్య ఉద్యమం సీమాంధ్రలో సెలవురోజైన ఆదివారం కూడా ఉద్ధృతంగా సాగింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ప్రజలు వివిధరూపాల్లో ఆందోళనలు హోరెత్తించారు. కృష్ణాజిల్లా కైకలూరు లో తెలంగాణ విడదీస్తే వలసలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయడానికి తట్టా, బుట్టలతో ప్రదర్శన చేశారు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవు సముద్రతీరంలో మునిసిపల్ ఉద్యోగులు జలదీక్ష చేపట్టారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వంద కార్లతో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు అరటి గెలలు కట్టిన సైకిళ్లతో రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన 2వేలమంది రైతులు ఆచంట వరకు పాదయాత్ర నిర్వహించారు. విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో అగ్నిదీక్ష చేశారు. విజయనగరంలో ఉపాధ్యాయులు చెవిలో పువ్వులు పెట్టుకుని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ఎదుట ఆందోళన చేశారు. బొబ్బిలిలో బొత్స దంపతుల మాస్కులు వేసుకున్న వారు ద్విచక్ర వాహనంపై పరారవుతున్నట్లు నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆర్సీఎం లూర్దుమాత చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కడపలో సహకార సమరం పేరుతో సహకార సంఘాల అధ్యక్షులు, డెరైక్టర్లు, రైతులు డీసీసీ బ్యాంకు ఎదుట సామూహిక దీక్షలు చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీవారిమెట్టు వద్ద 1,553 మంది భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టగా, సీమాంధ్ర జిల్లాలకు చెందిన 723 మంది సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. 7నుంచి సమ్మెలోకి .. ఇరిగేషన్ లాక్ సూపరింటెండెంట్ల సంఘం అక్టోబర్ ఏడో తేదీ నుంచి నీటిపారుదలశాఖ లాక్ సూపరిం టెండెంట్స సమ్మెబాట పట్టనున్నట్లు లాక్ సూపరింటెండెంట్స అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.ఆస్కారరావు, ప్రసాద్‌లు విజయవాడలో తెలిపారు. ఏపీఎన్జీవోల ఉద్యమానికి మద్దతుగా తాము కూడా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. బెంగళూరులోనూ సమైక్యహోరు బెంగళూరు: సమైక్యాంధ్ర నినాదాలతో బెంగళూరు నగరం దద్దరిల్లింది. ఆదివారం ఉదయం ఇక్కడి ఫ్రీడంపార్కలో జరిగిన జై సమైక్యాంధ్ర మహాగర్జనకు వేలాది మంది తరలివచ్చారు. కర్ణాటక తెలుగు ప్రజా సమతి అధ్యక్షుడు బొందు రామస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. రామస్వామి మాట్లాడుతూ.. రాష్ర్ట విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులోని చిత్తూరుజిల్లా గుమ్మిడిపూండి యూని యన్ పాదిరివేడులో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూ.24కోట్లు నష్టపోయిన కేఎస్ ఆర్టీసీ: విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె కారణంగా కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు తిరిగే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ ఆర్టీసీ) రూ.24కోట్ల ఆదాయం కోల్పోయిందని ఆ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు. నన్నే రాజీనామా చేయమంటారా..? సమైక్యవాదులపై టీడీపీ ఎంపీ ‘శివ’తాండవం సాక్షి నెట్వర్క: చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీకి చెందిన ఎంపీ డాక్టర్ శివప్రసాద్‌కు ఆదివారం సమైక్య సెగ తగిలింది. పలమనేరులో ఆందోళనకారులు అడ్డుకోగా, ‘‘నన్నే అడ్డుకుంటారా.. నన్నుమించిన సమైక్య మొనగాడు ఎవరైనా ఉన్నారా’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీగా స్పీకర్ ఫార్మెట్లో ఎందుకు రాజీనామా చేయలేదని, మీ అధినేత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన దానిపై ఎందుకు మాట్లాడరంటూ నిరసనకారులు ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎంపీ.. ఇలా చేస్తే తాను పార్లమెంట్లో నోరెత్తనని, అసలు రాజీనామానే చేయనన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సమైక్య ఉద్యమం గురించి అసలు పట్టించుకోనని మీరేం చేస్తారో చేసుకోండంటూ విరుచుకుపడ్డారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సమైక్యసభకు వెళ్లివస్తూ విద్యార్థి మృతి గుండెపోటుతో మరో ఉద్యమకారుడు కన్నుమూత సాక్షి, నెల్లూరు: సమైక్య ఉద్యమంలో చురుకుగా పొల్గొంటున్న ఇద్దరు ఆదివారం అసువులుబాసారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బసిరెడ్డిపాళెంనకు చెందిన ఇంటర్ విద్యార్థి సుధాకర్‌రెడ్డి (18) వింజమూరులో జరిగిన ‘సమైక్య విజృంభణ’కు హాజరయ్యాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం తన బైక్‌పై సొంతూరికి బయలుదేరాడు. బొమ్మరాజుచెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న మినీటాక్సీని ఢీకొనడంతో సుధాకర్‌రెడ్డి మృతిచెందాడు. అలాగే, పొదలకూరు మండలంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ, దళితగర్జన నిర్వహణ సన్నాహాల్లో నిమగ్నమైన పాణ్యం సురేష్(48) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. తోడేరు పంచాయతీ శాంతినగర్‌కు చెందిన సురేష్ బస్టాండ్ సెంటర్లో 35 రోజులుగా జరుగుతున్న రిలేదీక్షల్లో రోజూ పాల్గొనేవాడు.