ముసుగుతొలగింది..
ముసుగుతొలగింది..
Published Tue, Mar 11 2014 12:42 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
‘సమైక్యత’ మాటున ఏం చేసినా చెల్లుబాటవుతుందని అనుకుంటున్నారు రాజమండ్రి, విజయవాడ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్! ఆ నినాదాన్ని తమ అవకాశవాదానికి ముసుగుగా నిస్సిగ్గుగా వాడుకోవాలనుకుంటున్నారు. నిన్న రాజకీయంగా అస్త్రసన్యాసం చేసినట్టు ప్రకటించి, నేడు కొత్త పార్టీకి అస్త్రశస్త్రాలు సమకూర్చే వారి అవతారం ఎత్తినా.. ఫర్వాలేదనుకుంటున్నారు. అయితే.. అలాంటి ఊసరవెల్లులకు చుక్కెదురు కాక తప్పదంటున్నారు సీమాంధ్రులు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ర్ట విభజన నిర్ణయంతో హతాశులైనట్టు కనిపించారు రాజమండ్రి, విజయవాడ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్. తమకు రాజకీయాలంటేనే విరక్తి పుట్టినట్టు ప్రకటించారు. ఇంతలోనే తమ పలుకులను విస్మరించి, జనం ఏమనుకుంటారోనన్న జంకూగొంకూ లేకుండా, నిస్సిగ్గుగా సమైక్యాంధ్ర కోసమంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రెండు రోజుల్లో రాజమండ్రిలో ప్రకటించే రాజకీయ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ తామేగా మారిపోయారు. విభజన బిల్లును ఆమోదిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని జబ్బలు చరిచి మరీ ప్రకటించారు లగడపాటి. ‘టి’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడి, అపాయింటెడ్ డే కూడా ప్రకటించేసిన తరుణంలో ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో ఏర్పాటు కానున్న పార్టీకి ఆ ఇద్దరూ దగ్గరుండి జెండా, అజెండాలను రూపొందించే పనిలో నిమగ్నం కావడాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
కిరణ్ ఆధ్వర్యంలో పార్టీ ఏర్పాటు విషయం తెర మీదకు వచ్చిన దగ్గర నుంచి తెరవెనుక పనులు చక్కబెడుతూ ఉండవల్లి పెద్దన్నయ్య పాత్ర పోషిస్తూ వచ్చారు. కిరణ్‌కు తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చిన ఉండవల్లి ఏ పార్టీలో చేరేది లేదన్నారు. తీరా సోమవారం కిరణ్ హైదరాబాద్‌లో ప్రకటించిన పార్టీ తాత్కాలిక కమిటీ ఉపాధ్యక్షుల జాబితాలో ఉండవల్లి ఉండటం గమనార్హం. దీంతో ఉండవల్లి రాజకీయాలకు దూరంగా ఉంటానని గత మూడు నెలలుగా వేసుకున్న ముసుగు తొలగిపోయిందని సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. ఇక రాజకీయ సన్యాసమన్న లగడపాటి.. కిరణ్ పెట్టబోయే పార్టీ తాత్కాలిక కమిటీ సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్లమెంటుకు బిల్లు వచ్చినప్పుడు పెప్పర్ స్ప్రేతో హడావిడి చేసిన లగడపాటి కొత్తపార్టీలో కొత్త అవతారమెత్తారని జనం విమర్శిస్తున్నారు.
ఆ వైరాగ్యం ముందస్తు వ్యూహమే..
మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో రాజమండ్రి నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఉండవల్లి కాంగ్రెస్‌లో మేధావి వర్గ ప్రతినిధిగా, ఆ పార్టీ అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్నారు. అలాంటి ఉండవల్లి రాజమండ్రిలో పత్రికా సమావేశం నిర్వహించి, రాజకీయ వైరాగ్యం ప్రకటించి మిగిలిన జీవితమంతా కలం, కాగితంతో కాలక్షేపం చేస్తానని చెప్పుకున్నారు. మూడు నెలలు కూడా తిరగకుండానే మాట తప్పి కిరణ్ కోటరీలో కొత్త అవతారమెత్తారని సీమాంధ్ర జనం ఆక్షేపిస్తున్నారు. రాజకీయాలు విడిచిపెట్టే ఉద్దేశమే లేనప్పుడు జనవరిలో రాజకీయాలపై వైరాగ్యం ప్రకటించడమెందుకు, ఇప్పుడు కిరణ్ పార్టీతో అంటకాగడమెందుకని సమైక్యవాదులు మండిపడుతున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న ఉండవల్లి పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలపై వైరాగ్యం ప్రకటించినప్పుడే అదంతా ముందస్తు వ్యూహంలో భాగమనే అనుమానం కాస్తా ఇప్పుడు నిజమైంది.
సమైక్యవాదులను చితకబాదిన‘హర్ష’ కుమారులు..
ఇదంతా ఒక ఎత్తై కిరణ్‌కుమార్‌రెడ్డి రాజమండ్రిలో ఈ నెల 12న ప్రకటించే పార్టీకి తెలుగువారి ఆత్మగౌరవమే నినాదమని అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ తదితరులు ప్రకటించారు. విభజన విషయంలో ఆది నుంచి హర్షకుమార్ పలు విమర్శలను ఎదుర్కొన్నారు. మొదట్లో ‘జై ఆంధ్ర’ ఉద్యమ వాదినని, తెలంగాణ ను విభజించాలని డిమాండ్ చేశారు. జనం నుంచి ప్రతిఘటన ఎదురై, గత్యంతరం లేకసమైక్యాంధ్రకు మద్దతన్నారు. అప్పుడైనా చిత్తశుద్ధితో కృషి చేశారా అంటే అదీ కూడా లేదని సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. ఇందుకు గతేడాది అక్టోబర్ 5న తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా రాజమండ్రి పేపర్‌మిల్‌ను మూయించివేసేందుకు అక్కడకు వెళ్లిన సమైక్యవాదులు హర్షకుమార్‌కు చెందిన కళాశాల బోర్డును చింపడం,
రోడ్డును దిగ్బంధించగా.. ఎంపీ తనయులు శ్రీరాజ్, సుందర్‌లు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత ప్రమోద్‌కుమార్, పేపర్‌మిల్ ఉద్యోగి దుర్గాప్రసాద్ తదితరులపై తరిమి, తరిమి కర్రలతో దాడి చేసినప్పుడే హర్షకుమార్ చిత్తశుద్ధిపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి హర్షకుమార్, ఇక రాజకీయాల్లోనే ఉండమన్న ఉండవల్లి, లగడపాటి ఎన్ని వ్యూహాలు పన్నినా సీమాంధ్రలో నిన్నమొన్నటి వరకు వెంట ఉన్న ఎమ్మెల్యేలే వారిపై నమ్మకం లేక దూరమైపోయారు. ఇక సీమాంధ్ర ప్రజలు వారిని ఎలా నమ్ముతారని వారి అనుచరులే విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలపై లగడపాటి, ఉండవల్లి సన్యాసం, వైరాగ్యం ప్రచార ఆర్భాటమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విభజన విషయంలో కూడా ఇదే రీతిలో వ్యవహరించబట్టే అధిష్టానం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదని అంటున్నారు.
వారంతా సమైక్యవాదులను గుడ్డలు ఊడదీసి తంతామన్న వారే..
ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెడుతున్న ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని జిల్లాలో దగ్గరుండి నడిపిస్తున్న వారు ఒకప్పుడు సమైక్య వాదులను గుడ్డలు ఊడదీసి తంతాం, ఉద్యోగులను తరిమి కొడతామని బెదిరించిన వారే. ఉండవల్లి సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేసిన సభలో తాను ఇక పార్లమెంటుకు వెళ్లనన్నారు. కానీ మర్నాటి నుంచే నెల పాటు సమావేశాల్లో పాల్గొన్నారు. రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాల్సిన సమయంలో ఈ ఎంపీలు అందరూ అధిష్టానానికి పాదాభివందనాలు చేశారు. ప్రజా ఉద్యమం ముమ్మరంగా సాగుతున్నప్పుడు ప్రజల్లోకి రాకుండా ఇంటి వద్ద పోలీసు కాపలాలు పెట్టించుకున్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. విభజన జరిగిపోతున్న తీరుతో ప్రజలు కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందు వల్ల రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీని వీడి డ్రామాలాడుతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యం కోసం రాజీనామా చేశారన్నప్పుడు జనం నమ్మారు. ఇప్పుడు అంతా అయిపోయాక పారీ ్టపెట్టడంతో ఈ సానుభూతి కూడా పూర్తిగా పోయింది. ఈ కొత్త సీసాలో పాత సారాను జనం నమ్మే పరిస్థితిలో లేరు. - ముప్పాళ్ల సుబ్బారావు, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్, రాజమండ్రి
Advertisement
Advertisement