నడిగోదారిలో వదిలిన ‘నల్లారి’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
సునామీని ఆపలేనేమో గానీ.. రాష్ట్ర విభజనను ఆపగలనన్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటం చివరికి ఉత్తర కుమార ప్రగల్భంగానే మిగిలిపోయింది. విభజనను అడ్డుకోగల బ్రహ్మాస్త్రమేదో తన వద్ద ఉందన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చి, పలువురిని తనతో అట్టి పెట్టుకున్న కిరణ్.. ఇప్పుడు తోక ముడిచి రాజీనామా చేశారు. దాంతో ఆ ఎమ్మెల్యేలు.. ‘వెనకటికో అవిటివాడు.. రాత్రి వేళలో దారి పక్కన చెట్టు కింద.. తన వైకల్యం కనబడకుండా నిండా రగ్గు కప్పుకొని, పక్కన దుడ్డుకర్ర పెట్టుకుని ‘లేస్తే మనిషిని కాదు. నీ దగ్గరున్నదంతా అక్కడ పెట్టి.. వెనక్కి తిరిగి చూడకుండా పో’ అని భయపెట్టి దోచుకునే వాడు’ అన్న కథను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. విభజనపై కిరణ్ వాగాడంబరమూ చివరికి ఆ బాపతుగానే తేలిందని వాపోతున్నారు. ఆయనను నమ్మిన తమ పని ‘కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదిన’ చందంగా మిగిలిందని మండిపడుతున్నారు. ఇప్పుడు నిండా మునిగిపోయామని ఆవేదన చెందుతున్నారు.
‘మీ వెంట నేనుంటా, అవసరమైతే పార్టీ పెడదా’మన్న కిరణ్ బుధవారం రాజీనామా చేయడంతో జిల్లాలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు..ఆయనపై మండిపడుతున్నారు. ఇలా జరుగుతుందని తెలిస్తే ముందే ‘వ్యూహాత్మకం’గా వ్యవహరించి ఉండేవాళ్లం కదా.. అని వాపోతున్నారు. ‘కిం కర్తవ్యం’ అని తల పట్టుకుని, తుపాకీ పేలినప్పుడు పిట్టల్లా.. తలోదారీ వెతుక్కునే పనిలో పడ్డారు. కొందరు రాజకీయాలకే గుడ్‌బై చెప్పాలనుకుంటుండగా, కొందరు వేచి చూడాలనుకుంటున్నారు. ఇంకొందరైతే టీ బిల్లు రాజ్యసభలో ఏమౌతుందో చూశాక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.
నాడే పదవిని విడిచి ఉంటే..
మొదట్లో సీఎం కోటరీలో ఉన్న మంత్రి తోట నరసింహం విభజనపై నిర్ణయం ఎలా ఉన్నా కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాజీనామా ప్రకటించిన తోట బుధవారం సీఎం రాజీనామా చేసే వరకు పదవిని అంటిపెట్టుకునే ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం భార్య వాణితో కాకినాడలో ఆమరణదీక్ష చేయించిన నాడే మంత్రి పదవిని వదులుకుని ఉంటే జనం జేజేలు పలికేవారని సమైక్యవాదులు అంటున్నారు. అటు కిరణ్‌కు, ఇటు కేంద్ర మంత్రి చిరంజీవికి సన్నిహితంగా మెలగిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఇంత కాలం సీఎం అడుగుజాడల్లో నడిచిన ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, నల్లమిల్లి శేషారెడ్డి, పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరీదేవి, రాజా అశోక్‌బాబు, పంతం గాంధీమోహన్ తలో దిక్కూ చూస్తున్నారు. మొదట్లో వీరి బాటలోనే పయనించిన రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా కిరణ్ వెంట ఉంటే భవిష్యత్ ఉండదని మరో దారిలేక ‘సైకిల్’ ఎక్కే ప్రయత్నాల్లో ఉన్నారు.
రాజకీయ వైరాగ్యంలో శేషారెడ్డి?
సీఎం పెట్టే కొత్తపార్టీ వెంటే ఉంటామన్న రౌతు, అశోక్‌బాబు, శేషారెడ్డిలను తాజా పరిణామాలు మనసు మార్చుకునేలా చేశాయంటున్నారు. రాజీనామా చేసిన సీఎం వల్ల రాజకీయంగా ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయానికి వచ్చినందునే అశోక్‌బాబు తాను రాజీనామా చేయకుండా, ఐదేళ్లూ ఎమ్మెల్యేగా కొనసాగుతానని బుధవారం తునిలో ప్రకటించారంటున్నారు. ఏ పార్టీలోకి వెళతారనే విషయంపై మాట్లాడుతూ అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాన నడం గమనార్హం. సీఎం నిర్ణయమే తన నిర్ణయమని పదేపదే చెపుతూ వచ్చిన శేషారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై రెండు, మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తాజా పరిణామంతో కిరణ్‌పై గురి తప్పిన ఆయన చివరకు రాజకీయాలకే గుడ్‌బై చెప్పాలనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. అనపర్తిలో మిగిలి ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల అనంతరం ఆయన ప్రజల సమక్షంలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
ఎటు పయనిస్తారో..?
కాకినాడ రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున తిరిగి పోటీ చేయడంపై తేల్చుకోలేకపోతున్న కన్నబాబు తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఏమౌతుందో చూశాకే ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. విభజన సెగ తగిలిన మొదట్లో మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు కన్నబాబు కూడా రాజీనామా చేసినా.. అధికారాన్ని వదులుకోలేక దానిని ఆమోదింపచేసుకునే సాహసం చేయలేకపోయారు. విభజన నిర్ణయం సమయంలో సీఎం కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని మొదటగా ప్రకటించింది ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు. అలాంటి రౌతు కాంగ్రెస్‌లో ఉండలేక, మరో పార్టీలో అవకాశం లేక, సీఎం వెంట ఉన్న కారణంగా రాజకీయంగా దారీతెన్నూ కానరాని అయోమయంలో చిక్కుకున్నారని అనుచరులు అంటున్నారు. అన్నీ ఆలోచించి త్వరలో తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానంటున్న రౌతు నిర్ణయం ఏమై ఉంటుందా అనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. మిగిలిన ఎమ్మెల్యేలు పొన్నాడ, పాముల, పంతం కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారంతా ఎటు పయనిస్తారో, ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.