సాక్షి నెట్‌వర్క్: అరవై ఒక్క రోజులుగా అలుపెరుగని సమైక్య ఉద్యమం సీమాంధ్రలో సెలవురోజైన ఆదివారం కూడా ఉద్ధృతంగా సాగింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ప్రజలు వివిధరూపాల్లో ఆందోళనలు హోరెత్తించారు. కృష్ణాజిల్లా కైకలూరు లో తెలంగాణ విడదీస్తే వలసలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయడానికి తట్టా, బుట్టలతో ప్రదర్శన చేశారు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవు సముద్రతీరంలో మునిసిపల్ ఉద్యోగులు జలదీక్ష చేపట్టారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వంద కార్లతో ర్యాలీ నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు అరటి గెలలు కట్టిన సైకిళ్లతో రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన 2వేలమంది రైతులు ఆచంట వరకు పాదయాత్ర నిర్వహించారు. విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో అగ్నిదీక్ష చేశారు. విజయనగరంలో ఉపాధ్యాయులు చెవిలో పువ్వులు పెట్టుకుని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ఎదుట ఆందోళన చేశారు. బొబ్బిలిలో బొత్స దంపతుల మాస్కులు వేసుకున్న వారు ద్విచక్ర వాహనంపై పరారవుతున్నట్లు నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆర్‌సీఎం లూర్దుమాత చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కడపలో సహకార సమరం పేరుతో సహకార సంఘాల అధ్యక్షులు, డెరైక్టర్లు, రైతులు డీసీసీ బ్యాంకు ఎదుట సామూహిక దీక్షలు చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీవారిమెట్టు వద్ద 1,553 మంది భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టగా, సీమాంధ్ర జిల్లాలకు చెందిన 723 మంది సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.
7నుంచి సమ్మెలోకి .. ఇరిగేషన్ లాక్ సూపరింటెండెంట్ల సంఘం
అక్టోబర్ ఏడో తేదీ నుంచి నీటిపారుదలశాఖ లాక్ సూపరిం టెండెంట్‌స సమ్మెబాట పట్టనున్నట్లు లాక్ సూపరింటెండెంట్‌స అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.ఆస్కారరావు, ప్రసాద్‌లు విజయవాడలో తెలిపారు. ఏపీఎన్‌జీవోల ఉద్యమానికి మద్దతుగా తాము కూడా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
బెంగళూరులోనూ సమైక్యహోరు
బెంగళూరు: సమైక్యాంధ్ర నినాదాలతో బెంగళూరు నగరం దద్దరిల్లింది. ఆదివారం ఉదయం ఇక్కడి ఫ్రీడంపార్‌కలో జరిగిన జై సమైక్యాంధ్ర మహాగర్జనకు వేలాది మంది తరలివచ్చారు. కర్ణాటక తెలుగు ప్రజా సమతి అధ్యక్షుడు బొందు రామస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. రామస్వామి మాట్లాడుతూ.. రాష్ర్ట విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులోని చిత్తూరుజిల్లా గుమ్మిడిపూండి యూని యన్ పాదిరివేడులో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూ.24కోట్లు నష్టపోయిన కేఎస్ ఆర్టీసీ: విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె కారణంగా కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు తిరిగే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ ఆర్టీసీ) రూ.24కోట్ల ఆదాయం కోల్పోయిందని ఆ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు. నన్నే రాజీనామా చేయమంటారా..?
సమైక్యవాదులపై టీడీపీ ఎంపీ ‘శివ’తాండవం
సాక్షి నెట్‌వర్‌క: చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీకి చెందిన ఎంపీ డాక్టర్ శివప్రసాద్‌కు ఆదివారం సమైక్య సెగ తగిలింది. పలమనేరులో ఆందోళనకారులు అడ్డుకోగా, ‘‘నన్నే అడ్డుకుంటారా.. నన్నుమించిన సమైక్య మొనగాడు ఎవరైనా ఉన్నారా’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీగా స్పీకర్ ఫార్మెట్‌లో ఎందుకు రాజీనామా చేయలేదని, మీ అధినేత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన దానిపై ఎందుకు మాట్లాడరంటూ నిరసనకారులు ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎంపీ.. ఇలా చేస్తే తాను పార్లమెంట్‌లో నోరెత్తనని, అసలు రాజీనామానే చేయనన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సమైక్య ఉద్యమం గురించి అసలు పట్టించుకోనని మీరేం చేస్తారో చేసుకోండంటూ విరుచుకుపడ్డారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
సమైక్యసభకు వెళ్లివస్తూ విద్యార్థి మృతి
గుండెపోటుతో మరో ఉద్యమకారుడు కన్నుమూత
సాక్షి, నెల్లూరు: సమైక్య ఉద్యమంలో చురుకుగా పొల్గొంటున్న ఇద్దరు ఆదివారం అసువులుబాసారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బసిరెడ్డిపాళెంనకు చెందిన ఇంటర్ విద్యార్థి సుధాకర్‌రెడ్డి (18) వింజమూరులో జరిగిన ‘సమైక్య విజృంభణ’కు హాజరయ్యాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం తన బైక్‌పై సొంతూరికి బయలుదేరాడు. బొమ్మరాజుచెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న మినీటాక్సీని ఢీకొనడంతో సుధాకర్‌రెడ్డి మృతిచెందాడు. అలాగే, పొదలకూరు మండలంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ, దళితగర్జన నిర్వహణ సన్నాహాల్లో నిమగ్నమైన పాణ్యం సురేష్(48) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. తోడేరు పంచాయతీ శాంతినగర్‌కు చెందిన సురేష్ బస్టాండ్ సెంటర్‌లో 35 రోజులుగా జరుగుతున్న రిలేదీక్షల్లో రోజూ పాల్గొనేవాడు.
విరామమెరుగుని సీమాంధ్ర పోరు
Published Mon, Sep 30 2013 3:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement
Advertisement