సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కమిటీ గురువారం తొలిభేటీ నిర్వహించనుంది. సీమాంధ్రలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం తీరు తెన్నులు, పార్టీ శ్రేణులు అందులో భాగస్వాములు కావడం అనే అంశాలపై చర్చించనున్నారు. అంతిమంగా ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అధిష్టానం అభీష్టానికి అనుగుణంగా దాని దశదిశలను మార్చడమెలా అన్నదానిపై కార్యాచరణను రూపొందించే పనిలో పడ్డారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసప్రాంగణం క్లబ్‌హౌస్‌లో గురువారం ఈ భేటీ జరగనుంది. సమైక్య ఉద్యమం నేపథ్యంలో గత రెండు నెలలుగా కాంగ్రెస్ నేతలెవరూ సొంత నియోజకవర్గాల్లో అడుగుపెట్టలేకపోయారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన నియోజకవర్గానికి రెండునెలలుగా ముఖం చాటేయాల్సి వచ్చింది. ఒకటిరెండుసార్లు ఆ ప్రాంతానికి వెళ్లినా ఎవరి కంటా పడకుండా రాత్రికి రాత్రి వెళ్లిరావడంపై పార్టీవర్గాల్లోనే చర్చ సాగింది. ఇటీవలి పై-లీన్ తుపాను పుణ్యమా అని ఏపీ ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెనుంచి ఒకింత వెనక్కు తగ్గడంతో ఇదే అదనుగా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. సమైక్య ఉద్యమంలోకి తాము, తమ అనుచరులు చొరబడేలా కార్యాచరణ రూపొందించడమే ప్రధాన ఎజెండాగా గురువారం భేటీ కొనసాగనుంది.
అధిష్టానం ఆలోచనల మేరకే..: అధిష్టానం ఆలోచనల మేరకే ఈ కమిటీ ఏర్పాటు జరిగింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స అధికారికంగా ఈ కమిటీ జాబితాపై సంతకం కూడా చేశారు. ఇపుడీ భేటీ కూడా అధిష్టానం సూచనల మేరకే నిర్వహిస్తున్నట్లు సమాచారం. కమిటీలో తమ అభీష్టానికి అనుగుణంగా నడచుకొనే సీనియర్ మంత్రులతో పాటు ఇతర నేతలకు పెద్దపీట వేశారు. సమైక్యవాదాన్ని వినిపించే సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి వంటి వారిని, పార్టీ వైఖరిని విమర్శించే వారిని దూరంగా ఉంచారు. అధిష్టానం మాటను జవదాటని మంత్రులు, నేతలను ఇందులో నియమించడం ద్వారానే కమిటీ వైఖరి స్పష్టమవుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. సమైక్యం అని కాకుండా సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు రక్షించుకోవాల్సి ఉందని ప్రకటిస్తూ వస్తున్న మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, పార్థసారథి వంటి వారికి కమిటీలో పెద్దపీట వేశారు. ఇక టీజీ వెంకటేశ్, తోటనరసింహం, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీ, బాలరాజు, అహ్మదుల్లా వంటి వారు అధిష్టానం ఎలా చెబితే అలా నడచుకుంటామని చెబుతుండడంతో గురువారం నాటి భేటీలో చర్చ సమైక్యం అని కాకుండా ప్రజలను విభజన దిశగా ఎలా ఒప్పించాలనే దిశగానే సాగే అవకాశముందని పార్టీనేతలే పేర్కొంటున్నారు.
ఉద్యమంలోకి చొరబాటెలా?
Published Wed, Oct 16 2013 4:11 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement