ఎమ్మెల్సీ నువ్వా...నేనా !
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వారు, సీటు ఆశించి భంగపడిన వారు మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో చిత్తూరులో ఖాళీగా ఉన్న ఒక స్థానం కోసం మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి, అశోక్‌రాజు రాజధాని బాట పట్టారు.
సాక్షి, చిత్తూరు:ఈ ఏడాది రాష్ట్రంలో ఒకేసారి పుర, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి పదవుల భర్తీ పూర్తయింది. టీడీపీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీపై తమ్ముళ్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మార్కెట్, దేవాదాయ శాఖల పాలక మండళ్లను రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో వాటిపై ఆశలు వదులుకున్నారు. దీంతో మరో ఐదే ళ్లు ఏ స్థాయి నాయకుడు ఏ పదవి కోసం చూసే పనిలేకుండా పోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యే కోటాలో కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఒక స్థానం ఖాళీ అయింది. అలాగే కడపకు చెందిన ఎమ్మెల్సీ షేక్‌హుస్సేన్ రాజీనామాతోమరో స్థానం ఖాళీ అయింది. గవర్నర్ కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఉండడం, ప్రస్తుతం ఏడుగురు కొనసాగుతుండడంతో ‘గవర్నర్‌కోటా’పై ఇన్నాళ్లు గందరగోళం నెలకొంది. షేక్ హుస్సేన్ రాజీనామాతో గవర్నర్ కోటా లెక్క సరిపోయింది. ఎమ్మెల్యే కోటాలోని స్థానంలో మంత్రి నారాయణ ఎన్నిక కావడం లాంఛనమే! ఈ ఎన్నికకు ఈ నెల 4న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
ఇక స్థానిక సంస్థల ఖాళీల నిర్వహణపై దృష్టి
స్థానిక సంస్థల కోటాలో చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కో స్థానం, గుంటూరు జిల్లాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఈ పాటికే ఎన్నికల నిర్వహణ పూర్తి కావల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లులో జరిగిన పొరపాటు వల్ల ఆలస్యమైంది. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో మండలి స్థానాలు 20 ఉంటే బిల్లులో 17 అని చూపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పేర్కొన్నప్పుడు 20 అని పేర్కొన్నారు. ఈ తప్పిదంతో ఎన్నికల నిర్వహణ కాస్త ఆలస్యమైంది. దీనికితోడు ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్సీ స్థానాలను 50 ఉన్నట్లు చూపించారు. విభజన నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన మరో 8 స్థానాలు పెంచుకునేందుకు రాష్ట్రానికి అవకాశం ఉంది. ఈ విషయమై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ముఖ్యమంత్రితో పాటు ఎన్నికల కమిషన్, గవర్నర్‌కు ఓ లేఖ రాశారు.
మరో 8 మండలి స్థానాలను పెంచుకునే అవకాశం రాష్ట్రానికి ఉందని, ఆ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యే కోటా ఎన్నిక పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల కోటా నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే జరిగితే చిత్తూరులో ఉన్న ఒక స్థానం కోసం టీడీపీలో మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారితో పాటు నగరికి చెందిన మరో నేత అశోక్‌రాజు పోటీ పడుతున్నారు. వీరిలో ఎమ్మెల్సీ పదవిపై గాలి బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఒకానొక దశలో టీటీడీ చైర్మన్ రేసులో నిలిచిన గాలి ముద్దుకృష్ణమ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘అభయహస్తం’తో తప్పుకున్నారు. ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అత్యధికంగా 8 స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది.
తన సొంత జిల్లాలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రభావం చూపడంతో పార్టీ బలోపేతంపై బాబు దృష్టి సారించారు. సీఎంగా తాను ఉన్నప్పటికీ రాజధానికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, ఈ క్రమంలో బొజ్జలతో పాటు మరో మంత్రి జిల్లాకు ఉండాలని బాబు భావించినట్లు తెలిసింది. ఈ క్రమంలో గాలిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీ కోసం భారీగా డబ్బు ఖర్చుపెట్టానని, తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మహిళా కోటాలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని గల్లా అరుణకుమారి కూడా బాబు వద్ద గట్టిగానే వాణి వినిపించేందుకు సిద్ధమయ్యూరు.
ఇదే క్రమంలో మర్రిచెట్టు నీడలో పెరిగినట్లుగా గాలి నియోజకవర్గంలో ఉన్నందున ప్రతీసారి తనకు టికెట్టు దూరమవుతోందని, తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తేచాలని, అంతకు మించి వేరే పదవులు వద్దని అశోక్‌రాజు కూడా చంద్రబాబుతో చెప్పేందుకు సన్నద్ధమయ్యారు. చంద్రగిరి, నగరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందడం, రెండూ చిత్తూరు పార్లమెంట్ పరిధిలోనివే కావడం, ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్న ముగ్గురూ ఇదే పార్లమెంట్ పరిధిలోనే వారు కావడంతో ఎవరికి సీటు ఇస్తారోనని టీడీపీలో జోరుగా చర్చ సాగుతోంది. మరి బాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.