- ఎంఈవోల సమావేశంలో ఆర్జేడీ రమణకుమార్
చిత్తూరు(సెంట్రల్): జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతి తప్పనిసరిగా ఉండేలా చూడాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) రమణకుమార్ తెలిపారు. ఆయన బుధవారం జిల్లాలోని ఎంఈవోలతో సమావేశమయ్యూ రు. ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలును పరిశీలించే క్రమంలో రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని మౌలిక వసతులను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు ఒక కమిటీని వేసిందన్నారు.
ఈ కమిటీ చిత్తూరు జిల్లాలో త్వరలో పర్యటించనుందని తెలిపారు. ఆ సమయూనికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతి తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. ఈ మేరకు జిల్లాలోని ఏయే పాఠశాలల్లో మరుగుదొడ్లు సమగ్రంగా ఉన్నాయి. ఎక్కడ లేవనే విషయాన్ని పరిశీలిం చి వివరాలు ఇవ్వాలన్నారు. అలాగే తాగునీటి వసతి ఉన్న, లేని వాటి వాటి వివరాలను సర్వశిక్షాభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్ట్ అధికారికి సమర్పించాలన్నారు.
ఈ నివేదిక పరిశీలన అనంతరం అవసరమైన నిధులను ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్ట్ అధికారి విడుదల చేస్తారని చెప్పారు. సంబంధిత ఉన్నత పాఠశాలల్లో డీవైఈవోలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనులను త్వరిత గతిన జరిగేలా ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డీఈవో ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు స్థానిక సంస్థల అధ్యక్షుల సహాయ సహకారాలు తీసుకోవాలని తెలిపారు.
ఎస్‌ఎస్‌ఏ పీవో లక్ష్మీ మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్ల రిపేర్లు, తాగునీటి వసతి కల్పనకు సంబంధించిన వివరాలను అందించిన తర్వాత ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు తయారు చేస్తారని తెలిపారు. అనంతరం సంబంధిత పనులకు టెండర్లు పిలవడమో.. లేక నామినేషన్ ప్రాతిపదికన కేటాయించడమో చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎస్‌ఏ ఈఈ నతానియల్, డీవైఈవోలు చంద్రయ్య, శామ్యూల్, వాసుదేవనాయుడు తదితరులు పొల్గొన్నారు.