ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సన్నద్ధం కావాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి అధికారులకు సూచించారు. రీజియన్‌లోని డిపో మేనేజర్లతో శనివారం మేడారం జాతరపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్‌ఎం మాట్లాడుతూ జోన్‌లోని ఐదు జిల్లాల నుంచి మేడారం జాతరకు 3600 బస్సులు, రీజియన్ నుంచి 1,965 బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
గతంలో కంటే 15 నుంచి 20 శాతం అదనంగా బస్సులు నడపనున్నట్లు తెలిపారు. హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానం నుంచి 300 బస్సులు, కాజీపేట నుంచి 270 బస్సులు, వరంగల్ పాత మార్కెట్ నుంచి 330 బస్సులు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 250 బస్సులు, హైదరాబాద్ నుంచి 60 బస్సులు, పరకాల నుంచి 180 బస్సులు, నర్సంపేట, కొత్తగూడ నుంచి 180 బస్సులు, తొర్రూరు నుంచి 150, మహబూబాబాద్ నుంచి 150, భూపాలపల్లి నుంచి 65 బస్సులు నడుపుతామని చెప్పారు. అదేవిధంగా మేడారంలో 29 క్యూ రెయిలింగ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీంతో పాటు రెస్ట్‌రూంలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, అనౌన్స్‌మెంట్ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ఈ మేరకు బస్సులను సిద్ధం చేయాలని డిపో మేనేజర్లకు ఆర్‌ఎం సూచించారు.
ప్రయాణికుల భద్రతపై అలసత్వం వద్దు..
ప్రయాణికుల భద్రతపై అలసత్వం వహిస్తే సహించేది లేదని, బస్సుల కండీషన్‌ను డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్‌ఎం యాదగిరి సూచించారు. డిపోల్లోని అన్ని బస్సులను డీఎంలు స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. 15 రోజుల్లో డిపోల్లోని అన్ని బస్సులను తనిఖీ చేయాలని, ఎక్కడెక్కడ సమస్య ఉందో గుర్తించి వాటిని మరమ్మతు చేయించి, వైరింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ప్రయాణంలో వైరింగ్ సమస్యతో మంటలు లేచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గేట్ మీటింగ్‌ల్లో డ్రైవర్లకు చెప్పాల న్నారు.
మంటలు వ్యాపించిన వెంటనే ప్రయాణికులను బస్సులో నుంచి దింపడంతోపాటు బ్యాటరీ ద్వారా వచ్చే కనెక్షన్‌ను తొలగించాలని పేర్కొన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించేలా చూస్తూ ఆదాయాన్ని పెంచాలన్నారు. అదేవిధంగా వరంగల్, జనగామ, హన్మకొండ సిటీ బస్ స్టేషన్లను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ సీఎంఈ శ్రీధర్, డిప్యూటీ సీటీఎం భవానీప్రసాద్, తొమ్మిది డిపోల మేనేజర్లు పాల్గొన్నారు.
మేడారం జాతరకు సన్నద్ధం కావాలి
Published Sun, Dec 1 2013 4:27 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement