సాక్షిప్రతినిధి, నల్లగొండ్ర ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమవుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి వివిధ ప్రజా సమస్యలపై.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై ఆందోళనలు చేసిన ఆ పార్టీ ఇప్పటికే జిల్లాలో పాగా వేసింది.
ఇటీవలే సంస్థాగత నియామకాలనూ పూర్తి చేసుకుని కేడర్‌లో ఉత్సాహం నింపింది. మూడు నియోజకవర్గాలు మినహా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించిన పార్టీ అధినాయకత్వం, జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి
సారించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలోనే
ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో జరగనున్న పార్టీ రెండో ప్లీనరీలో శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని జిల్లాపార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆయా ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాందోళనలు చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పాగా వేయగలిగింది. సుదీర్ఘకాలంగా జిల్లాలో రాజకీయాలు నెరుపుతున్న పార్టీల కన్నా కూడా సంఖ్యాపరంగా మెరుగైన ఫలితాలనే సాధించింది. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మండల కన్వీనర్లు, పార్టీ అనుంబంధ సంఘాల జిల్లా కన్వీనర్ల నియామాకాన్ని పూర్తి చేసింది.
గ్రామ కమిటీల ఏర్పాటును కూడా పూర్తి చేసిన నాయకత్వం గ్రామ గ్రామానికి విస్తరించే పనిలో ఉంది. అధినాయకత్వం అంచనాల మేరకు పనిచేయలేక వెనుకబడిన వారి స్థానంలో మార్పులు చేర్పులు కూడా చేసి పనిచేసే వారికే స్థానమన్న సంకేతాలను ఇచ్చింది. జిల్లాకు కొత్త కన్వీనర్‌గా గట్టు శ్రీకాంత్‌రెడ్డిని నియమించడంతో పాటు, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల కోఆర్డినేటర్లను మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంకినేని వెంకటేశ్వరావును కూడా పక్కన పెట్టి ఆయన స్థానంలో బీరవోలు సోమిరెడ్డికి సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పజెప్పింది. ఇక, ఏప్రిల్ నెలలో జరాగాల్సి ఉన్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న నిర్ణయంలో భాగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది.
ప్లీనరీకి తరలిన ప్రతినిధులు
ఇడుపులపాయలో ఆదివారం జరగనున్న పార్టీ రెండో ప్లీనరీకి జిల్లా నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు శనివారమే తరలివెళ్లారు. నియోజకవర్గాల వారీగా పాసులు జారీచేశారు. మొత్తంగా జిల్లా నుంచి 4వందల మంది ప్రతినిధులకు ప్లీనరీలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ‘పార్టీ సీఈసీ సభ్యులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ముఖ్య కేడర్‌కు పార్టీ కేంద్ర కార్యాలయం పాసులు కేటాయించింది. ప్లీనరీలో తామూ పాల్గొనాలని నాయకులు, ముఖ్య కార్యకర్తలు భావించినా, జిల్లాకు కేటాయించిన సంఖ్య మేరకే అవకాశం ఉంది. ప్లీనరీలో పాల్గొనే అవకాశం తమకూ ఇవ్వాల్సిందేనని పలువురు పట్టుపట్టారు. అయినా, కొందరికే అవకాశం కల్పించగలిగాం’ అని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.
ఎన్నికలకు సన్నద్ధం
Published Sun, Feb 2 2014 4:26 AM | Last Updated on Mon, May 28 2018 1:30 PM
Advertisement
Advertisement