తిరుపతి స్పోర్ట్స్ : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) 2014-15 వార్షిక క్రీడాపోటీలకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల క్రీడాపోటీల వేదికలను స్పోర్ట్స్ కమిటీ ప్రకటించింది. ఎస్వీయూ ఫిజికల్ డిపార్టుమెంట్‌లో బుధవారం ఎస్వీయూ స్పోర్ట్స్ కమిటీ సమావేశం అయింది. కమిటీ చైర్మన్ అయిన వీసీ రాజేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2014-15 వార్షిక క్రీడాపోటీల నిర్వహణ, వేదికల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల పురుషుల గేమ్స్‌ను ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించాలని నిర్ణయించా రు.
అందులో వాలీబాల్, హాకీ, హ్యాండ్‌బాల్, టెన్నిస్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ ఉన్నాయి. పుత్తూరు శేషాచల వెంకటసుబ్బయ్య కళాశాల క్రీడామైదానంలో బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, కోకో నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో పురుషులకు షటిల్ బ్యాడ్మింటన్, చెస్, బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహిస్తారు. అంతర కళాశాలల బోధనా సిబ్బంది (పురుషులు) క్రీడలు వాల్మీకిపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు.
మహిళలకు ఎస్పీడబ్ల్యూలో...
ఎస్వీయూ అంతర కళాశాలల పరిధిలోని మిహ ళలకు తిరుపతి ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, పీజీ కళాశాలలో గేమ్స్ నిర్వహించనున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా అథ్లెటిక్ పోటీలను ఎస్పీడబ్ల్యూ కళాశాలలోనే నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. దీంతో పాటు ఎస్వీయూ పరిధిలోని అంతర కళాశాలల బోధన(మహిళలు) సిబ్బందికి ఇక్కడే అన్ని రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తారు.
స్పోర్ట్స్ స్కాలర్ షిప్ రూ.4 వేలకు పెంపు
యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదువుతూ క్రీడల్లో విశేషంగా రాణిస్తున్న పురుషులు 300 మంది, మహిళలు 200 మందికి ఎస్వీయూ ప్రతి ఏటా ‘స్పోర్ట్స్ మెరిట్ స్కాలర్‌షిప్’ కల్పిస్తోంది. ఈ ఏడాది నుంచి ఈ స్కాలర్‌షిప్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 1987లో ముద్రించిన ‘ఎస్వీయూ స్పోర్ట్స్ రూల్స్’ బుక్ స్థానంలో నూతన నిబంధనలతో బుక్‌ను తీసుకు రానున్నారు.
ఈ ఏడాది ఎస్వీయూ వార్షిక క్రీడల నిర్వహణకు రూ.32 లక్షల బడ్జెట్‌ను కేటాయించినట్టు వీసీ రాజేంద్ర తెలిపారు. గత ఏడాది రూ.28 లక్షలు కేటాయించామన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ దేవరాజులు నాయుడు, స్పోర్ట్స్ కమిటీ కార్యదర్శి, ఫిజికల్ డెరైక్టర్ శివశంకర్‌రెడ్డి, సభ్యులు ఉషారాణి (ఎస్పీడబ్ల్యూ), క్రిష్టఫర్ (ఎస్వీ ఆర్ట్స్), సత్యనారాయణ (శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల), రాబర్ట్ (పీవీకేఎన్, చిత్తూరు), నళిని (చిత్తూరు), ఎస్వీయూ అసిస్టెంట్ పీడీలు అవల్దార్ గిరిధర్, నాగమణి, పెన్నా భాస్కర్, చంద్రశేఖర్‌రాజు, మాధవ్‌రెడ్డి పాల్గొన్నారు.
వార్షిక క్రీడలకు ఎస్వీయూ సన్నద్ధం
Published Thu, Aug 21 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
Advertisement
Advertisement