మూగబోయిన ‘మీనా’ | Preposterous radio lessons to students | Sakshi
Sakshi News home page

మూగబోయిన ‘మీనా’

Published Mon, Nov 25 2013 2:36 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Preposterous radio lessons to students

మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు ఇతర విషయాలపై అవగాహన కల్పించి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ‘మీనా ప్రపంచం’ అటకెక్కింది. ఆరంభంలో ఉత్సాహం, ఆసక్తి చూపిన అధికారులు, ఉపాధ్యాయులు ఆ తరువాత పట్టించుకోక పోవడంతో విద్యార్థులకు విలువైన విజ్ఞానం అందకుండా పోతోంది. సరిగ్గా సిగ్నల్ రాకపోవడం, సరిపడా రేడియోలు పాఠశాలలకు అందించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం, సిలబస్ పూర్తికావడం లేదనే సాకుతో ఉపాధ్యాయులు రేడియోపాఠాలపై అనాసక్తి కనబర్చుతున్నారు. దీంతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మీనా ప్రపంచం కార్యక్రమం కొద్దిరోజుల్లోనే ఢీలాపడింది.
 
 ‘ఇంటర్‌నెట్’ కాలంలోకూడా రేడియో పాఠాలు
 2012 సెప్టెంబర్ 5న రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ఆధ్వర్యంలో ‘మీనా ప్రపంచం’ పేరుతో రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో రేడియో పాఠాలను విద్యార్థులకు అందించేందుకు ఏర్పా టు చేసిన ఈ కార్యక్రమం ఆరంభం ఘనం, ఆచరణ శూన్యంగా మారింది. అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతుల విద్యార్థులకు కథల రూపంలో బాలల హక్కులు, ఆరోగ్యం పరిశుభ్రత, స్నేహపూరిత బడులపై అవగాహనతోపాటు ఆసక్తి, ఆహ్లాదకర అంశాలపై ప్రత్యేక పాఠాలు విద్యార్థులకు వినిపించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా పాఠశాలల్లో రేడియోలు లేకపోవడం, ఉన్న రేడియోలు మూలన పడి పనిచేయక పోవడంతో, గతేడాది ఈ కార్యక్రమం ప్రారంభంలోనే ఆగింది.
 
 దీంతో ఆర్వీఎం ఈ ఏడాది ఆగష్టులో మరోసారి రేడియో పాఠాలు విద్యార్థులకు విన్పించాలని సంకల్పించింది. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి రెండు రేడియోలను కొనుగోలు చేయాలని ఆదేశించింది. నిధులు విడుదల చేయడంలో జాప్యం కావడంతో, పాఠశాల నిధుల నుంచి కొనుగోలు చేయాలని ఆర్వీఎం అధికారులు సూచించారు. ప్రస్తుతం సాంకేతిక పరంగా దూసుకుపోతున్న తరుణంలో, సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్ వంటివి అందరికి అందుబాటులోకి రావడంతో రేడియో అమ్మకాలు మార్కెట్లో అంతంత మాత్రంగాను ఉన్నాయి. తూర్పు జిల్లాలో ‘మీనా ప్రపంచం’ కార్యక్రమ పాఠాల సిగ్నల్స్ అందక పోవడం, మరికొన్ని పాఠశాలల్లో రేడియోలు కొనుగోలు చేయకపోవడం, రేడియో ప్రసారాలు మొదట్లో కొన్ని పాఠశాలల్లో విన్పించినా, అవి కూడా కొద్ది రోజులకే పరిమితం కావడంతో మీనా ప్రపంచం మూగబోయింది.
 
 కార్యక్రమంపై నిర్లక్ష్యం
 జిల్లాలోని 385 ప్రాథమికోన్నత, 436 ఉన్నత పాఠశాలల్లో ‘మీనా ప్రపంచం’ నిర్వహించాలని ఆర్వీఎం అధికారులు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలను ఆదేశించారు. ఒక్కో రేడియోను రూ.1000 చొప్పున రూ. 8,21,000లను పాఠశాలల నిధుల నుంచి ఖర్చు చేశారు. ఈ కార్యక్రమం సోమ నుంచి శుక్రవారం వరకు ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రసారం చేస్తారు. ఇందుకు పాఠశాలల్లోని 6,7,8 తరగతుల విద్యార్థులకు టైం టేబుల్‌లో పీరియడ్‌ను తప్పనిసరిగా కేటాయించాలి. కార్యక్రమం ప్రారంభంలో ఆసక్తి చూపిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కొద్దిరోజులకే పట్టించుకోవడం మానేశారు. దాదాపుగా అన్ని పాఠశాలల్లో ఒక్క రేడియో ద్వారానే విద్యార్థులకు పాఠాలు విన్పించడం ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది. రేడియో పాఠాలు విన్న తరువాత పిల్లల అభిప్రాయాలు, అనుభవాలను అభ్యసనంలో భాగంగా ఉపాధ్యాయులు చర్చకు పెట్టాలి. తద్వారా విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడాలి. కాని ఈ కార్యక్రమం వల్ల సమయం వృథాగా మారి, సిలబస్ పూర్తి చేయలేక పోతున్నామనే భావనతో ఉపాధ్యాయులు రేడియో పాఠాలను విన్పించడం లేదు. ఆర్వీఎం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో, విద్యార్థులకు ఎంతో విలువైన పాఠాలు అందడం లేదు. రూ. కోట్ల నిధులు విద్యార్థుల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ఖర్చు పెడుతున్న ఆర్వీఎం అధికారులు, వాటి అమలును పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తుండడంతో విద్యార్థులకు అందాల్సిన విలువైన పాఠాలు అందకుండా పోతున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు విద్యాశాఖ అధికారులు చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
 సిగ్నల్స్ సమస్య ఉంది..
 - పెరక యాదయ్య, ఆర్వీఎం పీవో
 
 గతేడాది మీనా ప్రపంచం జిల్లాలో ప్రారంభించాం. రేడియోలు పాఠశాల నిధులతో కొనాలని అన్ని పాఠశాలలకు ఆదేశాలిచ్చాం. రేడియోలను కొనుగోలు చేసి కొన్నాళ్లు రేడియో పాఠాలను అన్ని పాఠశాలల్లో విన్పించారు. కాని సిగ్నల్స్ సమస్య రావడంతో ఉన్నతాధికారులకు ఇప్పటికి మూడుసార్లు ఫిర్యాదు చేశాం. సిగ్నల్స్ సమస్య ఉన్నచోట రాష్ట్ర బృందం పరిశీలించి, సాంకేతిక సమస్యలను గుర్తించేందుకు టీంను జిల్లాకు పంపిస్తామన్నారు. త్వరలోనే అన్ని పాఠశాలల్లో సిగ్నల్స్ సమస్యను లేకుండా చేసి విద్యార్థులకు రేడియో పాఠాలు అందేలా చర్యలు తీసుకుంటాం.
 ఇవీ ప్రయోజనాలు..
     రేడియో పాఠాల ద్వారా పదాలను నేర్చుకోవ డం, పలు జ్ఞాన రూపాలను వినియోగించుకునే విధానం అలవాటు అవుతుంది.
 
     బట్టీ విధానానికి స్వస్తి. వాటికి బదులుగా ప్రతి చర్యలు, ప్రాజెక్టు పనులు, అన్వేషణలు, ప్రయోగాలు, విశ్లేషణలను అలవాటు చేసుకోవచ్చు.
 
     విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుం డా సమగ్ర అభివృద్ధికి, విద్యా ప్రణాళికకు తగిన అవకాశాలు కల్పించడం సాధ్యం అవుతుంది.
 
     రేడియో వినడం ద్వారా జ్ఞానాన్ని పొందడం.
 
     రోజువారి పాఠ్యప్రణాళికతో విభిన్న అంశాలు సమ్మిళితం చేస్తూ నేర్చుకోడానికి, తరగతిలో అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం.
 
     రేడియో పాఠాలతో పిల్లల అభిప్రాయాలను, అనుభవాలను ఉపాధ్యాయుడు చర్చపెట్టి వారి మానసిక వికాసానికి తోడ్పడటం.
 
     తరగతి గదిలో నిత్యం జరిగే అభ్యాసన కంటే కాస్త భిన్నంగా చదువులు సాగుతాయి.
     విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. లింగవి వక్షను రూపుమాపడానికి దోహద పడుతుంది.
     బాలల హక్కులపై అవగాహన కలుగుతుంది.
     విద్యార్థులు స్నేహపూర్వకంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement