radio lessons
-
మూగబోయిన రేడియో
విద్యాశాఖ కార్యక్రమాలు సకాలంలో అమలుకు ఏమాత్రం నోచుకోవడం లేదు. అధికారులు నిర్ణయాలు తీసుకోడం తప్పా అమలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలనే లక్ష్యంతో సర్వశిక్షా అభియాన్ ద్వారా జిల్లాలోని అన్నీ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం రేడియో పాఠాలను అమలు చేస్తుంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు దాటినా ఈ రేడియో పాఠాలు ఎక్కడా వినిపించడం లేదు. బేస్తవారిపేట: 2013–14వ సంవత్సరం నుంచి విందాం–నేర్చుకుందాం అనే పేరుతో ప్రసారమ్యే ఈ రేడియో పాఠాలు విద్యార్థుల్లో ఆసక్తిని రేకిత్తించి వారిలో అభ్యసన స్థాయిని పెంచుతాయి. కథలు, ఆటపాటలతో కూడిన విద్య కావడంతో విద్యార్థులంతా రేడియో పాఠాలను శ్రద్ధగా వినేవారు. విద్యా సంవత్సరం ప్రారంభమై వంద రోజులు దాటుతున్నా రేడియో పాఠాలపై కార్యచరణ ప్రణాళిక లేకపోవడంతో పాఠశాలల్లో రేడియోలు ఉలుకు, పలుకు లేకుండా ఉన్నాయి. ప్రతి రోజూ నిర్ణీత సమయంలో... విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠశాలల విద్యార్థులకు రేడియో పాఠాలను ముందుగానే అందించేవారు. రోజుకోసారి నిర్ణీత సమయంలోనే ఆయా పాఠాలు వినేందుకు వీలుండేది. నిపుణులైన విద్యావంతులు రేడియోలో పాఠాలు వినిపించేవారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు సైతం ఆసక్తిగా వినేవారు. రోజూ ఉదయం 11.15 గంటల నుంచి 11.45 గంటల వరకు అరగంట సేపు ప్రసారం చేసేవారు. 1, 2 తరగతులకు మంగళవారం, 3, 4, 5 తరగతులకు బుధ, గురు, శుక్రవారాల్లో ఆయా పాఠాలు వినిపించేవారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగం... పద్యాలు, పాఠాలు, కృత్యాలు, పొదుపు, హాస్య కథలు, నాటికలు వంటి సందేశాత్మక అంశాలతో పాటు గుణాత్మక విద్యలో భాగంగా వివిధ అంశాలు ప్రసారం అయ్యేవి. విన్న తరువాత వారు పూర్తి చేసిన ప్రతిస్పందన పత్రాలను ఎస్ఎస్ఏ అధికారులకు ఉపాధ్యాయులు పంపేవారు. ఆశాశవాణి ద్వారా విద్యా సంవత్సరం ఆరంభం నుంచి మార్చి వరకు ఒక ప్రణాళికా ప్రకారం చేసేవారు. ఉన్నత పాఠశాలల్లో మీనా ప్రపంచం... ఉన్నత పాఠశాలల్లో మీనా ప్రపంచం పేరుతో రేడియో పాఠాలు ప్రసారం అయ్యేవి. వీటిని కూడా ఈ ఏడాది ఇంకా ప్రారంభించలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రేడియో పాఠాల ప్రసార అంశం గతంలో వివాదాల్లో చిక్కుకుంది. ప్రసారాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వంద రోజులు దాటిన... ఎట్టకేలకు 2016లో రాష్ట్ర రాజీవ్ విద్యా మిషన్ తిరిగి రేడియో పాఠాలు పునఃప్రసారం కోసం చర్యలు చేపట్టారు. 2016 నవంబరు 23 నుంచి పాఠాలు వినిపించారు. ఆ తరువాత 2017లో అక్టోబరు వరకు రేడియో పాఠాలు ప్రారంభించలేదు. ఇక ఈ ఏడాది వంద రోజులు కావస్తున్నా రేడియో పాఠాలపై కార్యచరణ ప్రణాళిక లేకుండా పోయింది. చివరకు 3, 4 నెలలు మాత్రమే రేడియో పాఠాలు వినిపించడంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మూలకు చేరిన రేడియోలు... పాఠాలు ప్రసారం కాకపోవడంతో రేడియోలను బీరువాల్లో ఉంచారు. కొన్ని చోట్ల అవి పగిలిపోయి పనికి రాకుండా మారాయి. వీటికి మరమ్మతులు చేయడం, లేదా వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయలేదు. ఒక వేళ రేడియో పాఠాలు ప్రసారం చేసినా ఎన్ని పాఠశాలల్లో రేడియోలు పనిచేస్తున్నాయో లేదో అధికారులకే తెలియాలి. కొన్ని చోట్ల రేడియోల్లో బ్యాటరీలు బయటకు తీయకపోవడంతో జిగురు కారిపోయి పనికి రాకుండా పోయాయి. మరికొన్ని చోట్ల పనికి రాకుండా పోయాయి. ఇంకా షెడ్యూల్ రాలేదు.. ఈ ఏడాది రేడియో ప్రసారాల షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదు. అన్నీ పాఠశాలల్లో రేడియోలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలని హెచ్ఎంలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఉన్నతాధికారుల నుంచి షెడ్యూల్ రాగానే విందాం–నేర్చుకుందాం కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో అమలు చేయడం జరుగుతుంది. జింకా వెంకటేశ్వర్లు, ఎంఈఓ -
మళ్లీ.. ‘విందాం, నేర్చుకుందాం’
* పునఃప్రారంభమైన ‘మీనా ప్రపంచం’ * నెలరోజులు ఆలస్యంగా అందిన షెడ్యూల్ * పాఠాలను నష్టపోయిన విద్యార్థులు * ఇప్పటికీ మూలనే ఉన్న ‘రేడియో’లు నాగిరెడ్డిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ రేడియోలు పాఠాలు చెబుతున్నాయి. ఇటీవలే మళ్లీ మీనా ప్రపంచం ప్రారంభమయ్యింది. కాగా సమాచార లోపం కారణంగా విద్యార్థులు నెలరోజులు పాఠాలు నష్టపోవాల్సి వచ్చింది. అభ్యాసం అనేది మొదట వినడంతోనే ప్రారంభమవుతుంది. దృశ్యం కంటే శబ్ధానికే త్వరగా స్పందించడం సర్వసాధారణమైన విషయం. దీనిని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం ‘మీనా ప్రపంచం’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో రేడియో పాఠాలను ప్రవేశపెట్టింది. ప్రాథమిక దశలో శ్రవణ మాద్యమం ద్వారా పాఠాలను బోధించి, చిన్నారులను చదువుకు చేరువ చేయాలనేది లక్ష్యం. అయితే రాష్ట్రవిభజన నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో రేడియోలు మూగబోయాయి. ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వం రేడియో పాఠాలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ‘మన ప్రపంచం.. మీనా ప్రపంచం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు రేడియో ద్వారా పాఠాలను బోధించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు రేడియోలో రోజువారీగా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలతో కూడిన షెడ్యూల్‌ను రూపొందించారు. ఆ షెడ్యూల్‌ను అనుసరిస్తూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థులకు రేడియో పాఠాలను వినిపించాల్సి ఉంటుంది. సమాచార లోపంతో.. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని కిందిస్థాయికి చేరవేయడంతో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారు. డిసెంబర్ ఒకటో తేదీనుంచి ప్రారంభమైన కార్యక్రమానికి సంబంధించిన వివరాలు నాగిరెడ్డిపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డిసెంబర్ 31న అందాయి. రేడియో పాఠాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, కరదీపిక పుస్తకాలు, రోజువారీ కార్యక్రమ షెడ్యూల్ నెల ఆలస్యంగా అందాయి. దీంతో విద్యార్థులు నెల రోజుల పాఠాలను నష్టపోవాల్సి వచ్చింది. పర్యవేక్షణ కరువు పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘మన ప్రపంచం.. మీనా ప్రపంచం’ కార్యక్రమం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. పాఠశాలల తనిఖీకి వెళ్లే అధికారులు ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రిజిష్టర్లు పరిశీలిస్తున్నారే తప్ప రేడియో పాఠాలకు సంబంధించిన రిజిష్టర్ గురించి ఆరా తీసిన దాఖలాలు లేవు. దీంతో ఉపాధ్యాయులు సైతం ఈ కార్యక్రమం అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా చాలా పాఠశాలల్లో మూలనపడిన రేడియోల దుమ్మును ఇప్పటికీ దులపలేదని తెలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి రేడియో పాఠాల నిర్వహణపై పర్యవేక్షణ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
విద్యార్థులకు నేటి నుంచి రేడియో పాఠాలు
చాగల్లు : ప్రభుత్వ పాఠశాలల్లో మీనా ప్రపంచం, విందాం, నేర్చుకుందాం అనే రేడియో ప్రసార కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఆకాశవాణి ద్వారా విద్యార్థుల కోసం రాజీవ్ విద్యామిషన్ రేడియో పాఠాల కార్యక్రమాన్ని గతేడాది ప్రారంభించింది. దీనికోసం పాఠశాలలకు అప్పట్లో రేడియోలను పంపిణీ చేశారు. ఈ పాఠాల్లో కథల రూపంలో బాలల హక్కులు, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. మంచి అలవాట్లు, చక్కని కథలు, బుజ్జి ప్రశ్నలు, పాఠ్యాంశాలతో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడమే రేడియో పాఠాల ప్రధాన లక్ష్యం. ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు రేడియో కార్యక్రమాల ప్రసారాలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతానికి 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి విందాం, నేర్చుకుందా కార్యక్రమాల షెడ్యూల్‌ను ఇచ్చారు. మిగిలిన 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంబంధించి షెడ్యూల్, మీనా ప్రపంచం కార్యక్రమాల షెడ్యూల్‌ను పాఠశాలలకు ఇవ్వాల్సి ఉంది. విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 11.15 గంటల నుంచి 11.45 వరకు రేడియో కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు విద్యార్థుల మానసిక, శారీరక అభివృద్ధికి తోడ్పడతాయి. బట్టీ విధానానికి స్వస్తిపలికి అన్వేషణలు, విశ్లేషణలు, ఆలోచించే విధానం అలవడుతుంది. తరగతి గదిలో బోధించని పలు అంశాలను ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు. మూలకు చేరిన రేడియోలు రాజీవ్ విద్యామిషన్ ద్వారా గతేడాది చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రసార సేవలు సరిగా అందకపోవడంతోపాటు అనేక పాఠశాలల్లో రేడియోలు పాడై మూలకు చేరాయి. వీటిపై పాఠశాల హెచ్ఎంలు దృష్టి సారించడం లేదు. కొన్నిచోట్ల రేడియోలు పనిచేస్తున్నా ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. రేడియోల ద్వారా పాఠాలు విద్యార్థులకు చేరేలా విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మూగబోయిన ‘మీనా’
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు ఇతర విషయాలపై అవగాహన కల్పించి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ‘మీనా ప్రపంచం’ అటకెక్కింది. ఆరంభంలో ఉత్సాహం, ఆసక్తి చూపిన అధికారులు, ఉపాధ్యాయులు ఆ తరువాత పట్టించుకోక పోవడంతో విద్యార్థులకు విలువైన విజ్ఞానం అందకుండా పోతోంది. సరిగ్గా సిగ్నల్ రాకపోవడం, సరిపడా రేడియోలు పాఠశాలలకు అందించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం, సిలబస్ పూర్తికావడం లేదనే సాకుతో ఉపాధ్యాయులు రేడియోపాఠాలపై అనాసక్తి కనబర్చుతున్నారు. దీంతో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మీనా ప్రపంచం కార్యక్రమం కొద్దిరోజుల్లోనే ఢీలాపడింది. ‘ఇంటర్నెట్’ కాలంలోకూడా రేడియో పాఠాలు 2012 సెప్టెంబర్ 5న రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ఆధ్వర్యంలో ‘మీనా ప్రపంచం’ పేరుతో రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో రేడియో పాఠాలను విద్యార్థులకు అందించేందుకు ఏర్పా టు చేసిన ఈ కార్యక్రమం ఆరంభం ఘనం, ఆచరణ శూన్యంగా మారింది. అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతుల విద్యార్థులకు కథల రూపంలో బాలల హక్కులు, ఆరోగ్యం పరిశుభ్రత, స్నేహపూరిత బడులపై అవగాహనతోపాటు ఆసక్తి, ఆహ్లాదకర అంశాలపై ప్రత్యేక పాఠాలు విద్యార్థులకు వినిపించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా పాఠశాలల్లో రేడియోలు లేకపోవడం, ఉన్న రేడియోలు మూలన పడి పనిచేయక పోవడంతో, గతేడాది ఈ కార్యక్రమం ప్రారంభంలోనే ఆగింది. దీంతో ఆర్వీఎం ఈ ఏడాది ఆగష్టులో మరోసారి రేడియో పాఠాలు విద్యార్థులకు విన్పించాలని సంకల్పించింది. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి రెండు రేడియోలను కొనుగోలు చేయాలని ఆదేశించింది. నిధులు విడుదల చేయడంలో జాప్యం కావడంతో, పాఠశాల నిధుల నుంచి కొనుగోలు చేయాలని ఆర్వీఎం అధికారులు సూచించారు. ప్రస్తుతం సాంకేతిక పరంగా దూసుకుపోతున్న తరుణంలో, సెల్ఫోన్లు, ఇంటర్నెట్ వంటివి అందరికి అందుబాటులోకి రావడంతో రేడియో అమ్మకాలు మార్కెట్లో అంతంత మాత్రంగాను ఉన్నాయి. తూర్పు జిల్లాలో ‘మీనా ప్రపంచం’ కార్యక్రమ పాఠాల సిగ్నల్స్ అందక పోవడం, మరికొన్ని పాఠశాలల్లో రేడియోలు కొనుగోలు చేయకపోవడం, రేడియో ప్రసారాలు మొదట్లో కొన్ని పాఠశాలల్లో విన్పించినా, అవి కూడా కొద్ది రోజులకే పరిమితం కావడంతో మీనా ప్రపంచం మూగబోయింది. కార్యక్రమంపై నిర్లక్ష్యం జిల్లాలోని 385 ప్రాథమికోన్నత, 436 ఉన్నత పాఠశాలల్లో ‘మీనా ప్రపంచం’ నిర్వహించాలని ఆర్వీఎం అధికారులు ఆయా పాఠశాలల హెచ్ఎంలను ఆదేశించారు. ఒక్కో రేడియోను రూ.1000 చొప్పున రూ. 8,21,000లను పాఠశాలల నిధుల నుంచి ఖర్చు చేశారు. ఈ కార్యక్రమం సోమ నుంచి శుక్రవారం వరకు ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రసారం చేస్తారు. ఇందుకు పాఠశాలల్లోని 6,7,8 తరగతుల విద్యార్థులకు టైం టేబుల్లో పీరియడ్‌ను తప్పనిసరిగా కేటాయించాలి. కార్యక్రమం ప్రారంభంలో ఆసక్తి చూపిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కొద్దిరోజులకే పట్టించుకోవడం మానేశారు. దాదాపుగా అన్ని పాఠశాలల్లో ఒక్క రేడియో ద్వారానే విద్యార్థులకు పాఠాలు విన్పించడం ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది. రేడియో పాఠాలు విన్న తరువాత పిల్లల అభిప్రాయాలు, అనుభవాలను అభ్యసనంలో భాగంగా ఉపాధ్యాయులు చర్చకు పెట్టాలి. తద్వారా విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడాలి. కాని ఈ కార్యక్రమం వల్ల సమయం వృథాగా మారి, సిలబస్ పూర్తి చేయలేక పోతున్నామనే భావనతో ఉపాధ్యాయులు రేడియో పాఠాలను విన్పించడం లేదు. ఆర్వీఎం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో, విద్యార్థులకు ఎంతో విలువైన పాఠాలు అందడం లేదు. రూ. కోట్ల నిధులు విద్యార్థుల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ఖర్చు పెడుతున్న ఆర్వీఎం అధికారులు, వాటి అమలును పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తుండడంతో విద్యార్థులకు అందాల్సిన విలువైన పాఠాలు అందకుండా పోతున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు విద్యాశాఖ అధికారులు చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సిగ్నల్స్ సమస్య ఉంది.. - పెరక యాదయ్య, ఆర్వీఎం పీవో గతేడాది మీనా ప్రపంచం జిల్లాలో ప్రారంభించాం. రేడియోలు పాఠశాల నిధులతో కొనాలని అన్ని పాఠశాలలకు ఆదేశాలిచ్చాం. రేడియోలను కొనుగోలు చేసి కొన్నాళ్లు రేడియో పాఠాలను అన్ని పాఠశాలల్లో విన్పించారు. కాని సిగ్నల్స్ సమస్య రావడంతో ఉన్నతాధికారులకు ఇప్పటికి మూడుసార్లు ఫిర్యాదు చేశాం. సిగ్నల్స్ సమస్య ఉన్నచోట రాష్ట్ర బృందం పరిశీలించి, సాంకేతిక సమస్యలను గుర్తించేందుకు టీంను జిల్లాకు పంపిస్తామన్నారు. త్వరలోనే అన్ని పాఠశాలల్లో సిగ్నల్స్ సమస్యను లేకుండా చేసి విద్యార్థులకు రేడియో పాఠాలు అందేలా చర్యలు తీసుకుంటాం. ఇవీ ప్రయోజనాలు.. రేడియో పాఠాల ద్వారా పదాలను నేర్చుకోవ డం, పలు జ్ఞాన రూపాలను వినియోగించుకునే విధానం అలవాటు అవుతుంది. బట్టీ విధానానికి స్వస్తి. వాటికి బదులుగా ప్రతి చర్యలు, ప్రాజెక్టు పనులు, అన్వేషణలు, ప్రయోగాలు, విశ్లేషణలను అలవాటు చేసుకోవచ్చు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుం డా సమగ్ర అభివృద్ధికి, విద్యా ప్రణాళికకు తగిన అవకాశాలు కల్పించడం సాధ్యం అవుతుంది. రేడియో వినడం ద్వారా జ్ఞానాన్ని పొందడం. రోజువారి పాఠ్యప్రణాళికతో విభిన్న అంశాలు సమ్మిళితం చేస్తూ నేర్చుకోడానికి, తరగతిలో అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం. రేడియో పాఠాలతో పిల్లల అభిప్రాయాలను, అనుభవాలను ఉపాధ్యాయుడు చర్చపెట్టి వారి మానసిక వికాసానికి తోడ్పడటం. తరగతి గదిలో నిత్యం జరిగే అభ్యాసన కంటే కాస్త భిన్నంగా చదువులు సాగుతాయి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. లింగవి వక్షను రూపుమాపడానికి దోహద పడుతుంది. బాలల హక్కులపై అవగాహన కలుగుతుంది. విద్యార్థులు స్నేహపూర్వకంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.