తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం జయ నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఆస్థానం నిర్వహించనున్నారు. దీని కోసం తిరుమల శ్రీవారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఆలయంలో వేకువజామున 3గంటలకు సుప్రభాతం, తర్వాత శుద్ధి, ఏకాంతంగా తోమాల సేవ నిర్వహిస్తారు. బంగారు వాకిలిలో ఉదయం 6 గంటలకు మలయప్ప, అమ్మవార్లకు, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేకంగా ఉగాది ఆస్థానం, వేద పండితులు, సిద్ధాంతి పంచాంగ శ్రవణం, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆలయంలో విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం సేవలు రద్దు చేశారు.
ప్రత్యేకంగా పుష్పాలు, విద్యుత్ అలంకరణలు
ఉగాది సందర్భంగా ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు మూడు టన్నుల పుష్పాలు, పండ్లతో విశేషంగా అలంకరించారు. ఆలయంలోని బలిపీఠం, ధ్వజస్తంభం చుట్టూ భక్తులను ఆకట్టుకునే విధంగా విశేషంగా అలంకరించారు. రంగనాయక మండపం, ఆస్థానం జరిగే బంగారు వాకిలి వద్ద పుష్పాలతోపాటు పండ్లతో ప్రత్యేక అలంకరణలు చేశారు. పండ్లు, చెరకు గడలతో దేవతా ప్రతిమలు రూపొందించారు. ఆలయంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈసారి పుష్పాలంకరణలు భక్తులను కట్టిపడేస్తున్నాయి.