
ఎంపీ కనుమూరి స్వగ్రామానికి రాష్ట్రపతి
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 29న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వగ్రామం ఐ.భీమవరం వెళ్లనున్నారు. ఆకివీడు మండలం ఐ.భీమవరంలో కొత్తగా నిర్మించిన వేద పాఠశాల భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. రూ. కోటి టీటీడీ నిధులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని గతేడాది అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేత ప్రారంభింపచేయాలని కనుమూరి భావించారు.
అయితే భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో సాధ్యపడలేదు. దీంతో ప్రస్తుత రాష్ట్రపతిని రప్పించి ప్రారంభోత్సవం చేయిస్తున్నారు. రాష్ట్రపతి 29న ఉదయం 11 గంటలకు జిల్లాలో అడుగుపెట్టి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వెళతారని సమాచారం. ఇక కనుమూరి కొత్తగా నిర్మించి ఇటీవలే గృహప్రవేశం చేసిన భవంతిలో రాష్ట్రపతి విడిదికి ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.
సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వస్తున్నారంటేనే అధికారులకు కంటిమీద కునుకు ఉండదు. అలాంటిది దేశ ప్రథమ పౌరుడు జిల్లాలో పాదం మోపుతున్నారంటే సామాన్యమైన విషయం కాదు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రాష్ట్రపతి ప్రత్యేక హెలికాప్టర్‌లో రానున్నారు. ఆయన వెంట జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్‌ఎస్‌జీ) ఉంటారు. రాష్ట్రపతి ప్రయాణించే హెలికాఫ్టర్‌తో పాటు మూడు హెలికాప్టర్లు వెంట వచ్చే అవకాశం ఉంది.