
5న విశాఖకు ప్రణబ్, మోదీ
ఫ్లీట్ రివ్యూలో పాల్గొననున్న రాష్ట్రపతి, ప్రధాని
సాక్షి, విశాఖపట్నం: ఫిబ్రవరి 4 నుంచి విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి పర్యటన శుక్రవారం అధికారికంగా ఖరారైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 5న రాత్రి 9.10 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయంలోనే ఉన్న ఐఎన్‌ఎస్ డేగాలో రాత్రికి బస చేస్తారు. 6వ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి 11.45 వరకు ఐఎఫ్‌ఆర్‌ను యుద్ధనౌక నుంచి సమీక్షిస్తారు. సాయంత్రం 5.20 గంటలకు ఇండియన్ నేవీ బ్యాండ్ కన్సెర్ట్ అనంతరం ఐఎఫ్‌ఆర్ శిల్పాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాముద్రిక నేవల్ ఆడిటోరియంలో పోస్టల్ స్టాంపు విడుదల చేస్తారు. రాత్రి 7.40 నుంచి 9 గంటల వరకు తూర్పు నావికాదళ ఆఫీసర్ల మెస్‌లో అతిథులకు ఇచ్చే ప్రెసిడెన్షియల్ విందులో పాల్గొంటారు. ఏడో తేదీ ఉదయం 11 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని 11.20 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు.
ప్రధాని పర్యటన ఇలా..
ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న రాత్రి 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.35 గంటలకు నేవీ అతిథి గృహానికి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆరో తేదీ ఉదయం 8.15 గంటలకు నేవీ అతిథి గృహం నుంచి బయల్దేరి 8.30 గంటలకు ఐఎఫ్‌ఆర్ వేదిక వద్దకు వెళ్తారు. 11.45 గంటల వరకు జరిగే ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 9.25 గంటలకు విమానంలో భువనేశ్వర్ వెళ్తారు. ఏడో తేదీ సాయంత్రం 4.35 గంటలకు తిరిగి విశాఖ విమానాశ్రయానికి వస్తారు. 4.55 గంటలకు ఐఎఫ్‌ఆర్ వేదిక వద్దకు చేరుకుంటారు. 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే సిటీ పరేడ్‌లో పాల్గొంటారు. అనంతరం ప్రధానమంత్రి గౌరవార్థం అతిథులకు విందునిస్తారు. రాత్రి 9.25 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళతారు.
భారత్‌లో ఫ్లీట్‌కు తొలిసారి చైనా..
చైనా తొలిసారిగా భారత్‌లో జరగనున్న ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనబోతోంది. కాగా ఈ ఫ్లీట్‌కు ముందస్తుగా మూడు రోజుల పాటు సాగరతీరంలో నిర్వహించిన విన్యాసాల రిహార్సల్స్ శుక్రవారంతో ముగిశాయి. భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు, విమానాలతో పాటు ఇప్పటికే విశాఖ తీరానికి చేరిన పలు దేశాలకు చెందిన యుద్ధనౌకలు ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి. గగనతలం నుంచి పారాట్రూపర్లు నేలపైకి దిగి శత్రువులపై దాడి చేయడం నావికుల్ని ఒక్కసారిగా మోసుకుపోగల పి8ఐ, పలు తరగతులకు చెందిన డిస్ట్రాయిర్లు, ఫ్రిగేట్, కోర్వట్టీలు ఈ విన్యాసాల్లో తమ సత్తాను ప్రదర్శించాయి. శనివారం బీచ్ రోడ్డులో అంతర్జాతీయ కవాతు రిహార్సల్ నిర్వహించనున్నారు.