సూళ్లూరుపేట: రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మద్దతు ధరను మాత్రం వదిలేసింది. ధాన్యం మద్దతు ధర ఆశాజనకంగా లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో రబీ సీజన్‌లో వేసుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది అన్నదాతల అవస్థల వర్ణనాతీతంగా ఉన్నాయి.
జిల్లాలో వర్షపాతం తక్కువ కావడంతో మెట్ట ప్రాంతాలంతా ఎండిపోగా పల్లపు ప్రాంతాల్లో, బోర్లు, బావుల కింద ముదురుకాపులో వేసుకున్న పంటలు మాత్రమే పండాయి. లేతకాపులో వేసుకున్న పంటలను కాపాడుకునేందుకు ప్రస్తుతం రైతులు రేయింబవళ్లు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. మద్దతు ధర చూసి ఈసారి పెట్టిన పెట్టుబడులైనా వస్తాయా రావా! అని రైతాంగం ఆందోళన చెందుతున్నారు.
దళారుల చేతిలో ధర ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి పండిం చిన పంటను అమ్ముకునేందుకు రైతు ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ సొమ్మొకరిది సోకొకరిది అనే చందాన రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి వ్యాపారులు, దళారులు రేట్లు నిర్ణయిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ధాన్యానికి ధరలు లేకుండాపోయాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ప్రారంభంలో జిలకర మసూరి పుట్టి ధాన్యం రూ.15,000 నుంచి రూ.16,000 దాకా పలికింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే మిల్లర్లు, దళారులు రంగప్రవేశం చేసి రేట్లు లేకుండా చేస్తున్నారు. సాధారణ రకాలు రూ.9,500 నుంచి రూ.10,000 వరకు, జిలకర మసూరి ధాన్యం రూ.12,500లకే మిల్లర్లు, దళారులు రేట్లు నిర్ణయించి కోనుగోలు చేసి స్టాక్ చేస్తున్నారు.
తేమ పేరుతో కత్తెర
గత ఏడాది ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 135 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా రైతులు వాటివైపు చూడనేలేదు. ఈ ఏడాది కూడా జిల్లావ్యాప్తంగా 150కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటుచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ 17 శాతం ఉండాలి. ఇదంతా తీసేస్తే రైతులకు మిగిలేది అప్పులే అన్న చందాన ఉంది పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరల కంటే బయటి మార్కెట్‌లోనే పది రూపాయలు ఎక్కువగా ఉండటంతో సన్న, చిన్నకారు రైతులు వారికే అమ్మేసుకుంటున్నారు. పెద్దరైతులు మాత్రం ఆరబెట్టి నిల్వ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పెరిగిన పెట్టుబడులు
ఈ ఏడాది పెరిగిన ఎరువుల ధరలు, పురుగుమందుల ధరలు, పెరిగిపోయిన కూలీరేట్లు వెరసి ఎకరానికి సుమారుగా రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పైగా పెట్టుబడులయ్యాయని రైతులు చెబుతున్నారు. వర్షాభావంతో అదనంగా మరో ఐదారు వేలు, కౌలు అదనం. ఈ పరిస్థితుల్లో మిల్లర్లు, దళారులు రైతులను నిలువుదోపిడీ చేస్తుంటే రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అంతకంటే దారుణంగా, నట్టేటముంచే విధంగా మద్దతు ధర ప్రకటించడం దారుణమంటున్నారు.
ధర దిగాలు
Published Fri, Feb 13 2015 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement