
సాక్షి, పాలకొల్లు(పశ్చిమ గోదావరి): పంచారామా క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు కోట నాగవెంకట ప్రసాద్(నాగబాబు) మహాపర్వదినమైన ఏకాదశి రోజున శివైక్యం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని మహిషాసుర మర్ధిని అమ్మవారికి పూజలు చేస్తున్న పూజారి నాగబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆలయ సిబ్బంది వెంటనే పూజారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగా ఆయన శివైక్యం చెందినట్టుగా తెలుస్తోంది.
పూజారి శివైక్యం చెందడటంతో క్షీరా రామలింగేశ్వర ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం వరకు భక్తులు ఎవరు దర్శనానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. సంప్రోక్షణ అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకోనుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 11న భీమవరం పంచారామ ఆలయ గర్భగుడిలో కుప్పకూలిన పూజారి రామరావు శివైక్యం చెందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment