ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : కేంద్ర పారిశ్రామిక త్రైపాక్షిక కమిటీ పునరుద్దరించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుంపల ప్రసాద్ హెచ్చరించారు. కేంద్రంలో ఎన్‌డీఎ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షలాది మంది కార్మికులకు ప్రయోజనం కలిగించే పారిశ్రామిక త్రైపాక్షిక కమిటీని రద్దు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను మంగళవారం సాయంత్రం స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో దహనం చేశారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసి బీజేపీ అధికారంలోకి రాగానే తన నిజస్వరూపాన్ని బయటపెడుతోందన్నారు. సేల్స్ రంగంలో పనిచేసే లక్షలాది మంది అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్న హక్కును ఒక్క కలంపోటుతో రద్దు చేయడం దారుణమన్నారు. తొలుత మెడికల్ రిప్రజెంటేటివ్‌లు పవరుపేటలోని సీఐటీయూ కార్యాలయం నుంచి బోసు శిబిరం, రమామహాల్, విజయవిహార్ సెంటర్, ప్రభుత్వాసుపత్రి మీదుగా ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏపీఎంఎస్‌ఆర్‌యూ అధ్యక్షుడు ఏకే జోషి, కార్యదర్శి వీవీవీఎన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్, ఎం.మురళీమోహన్, పి.కిరణ్ కుమార్, ప్రకాష్ రెడ్డి నాయకత్వం వహించారు.