ప్రైవేటు బస్సులు సీజ్
Published Sun, Jan 26 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ :కోనసీమలో రవాణా శాఖ అధికారులు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెండు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. రావులపాలెం, అంబాజీపేటల్లో తనిఖీలు చేశారు. విజయవాడ నుంచి వైజాగ్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాంట్రాక్ట్ పర్మిట్‌తో స్టేజ్ క్యారేజ్ సర్వీసుగా నడుపుతున్నట్టు గుర్తించి, దానిని సీజ్ చేశామని అమలాపురం ఆర్టీఓ అశోక్‌కుమార్ ప్రసాద్ తెలిపారు. రావులపాలెంలో హైదరాబాద్ నుంచి అమలాపురం వస్తున్న ప్రైవేటు బస్సును తనిఖీ చేసి, పర్మిట్ లేనట్టు గుర్తించామన్నారు. సీజ్ చేసిన రెండు బస్సులను అమలాపురం ఆర్టీసీ బస్టాండ్‌కు తరలించామని ఆర్టీఓ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు జీవీ నరసింహారావు, ప్రసాద్ పాల్గొన్నారు.
మండపేటలో..
మండపేట : నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తీసుకువెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును శనివారం రాత్రి మండపేట రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మండపేటలో అధికారులు తనిఖీ చేశారు. కాంట్రాక్ట్ క్యారేజ్ అనుమతితో స్టేజి క్యారేజ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించామని ఎంవీఐ వి.శ్రీనివాస్ తెలిపారు. బస్సును సీజ్ చేసి రామచంద్రపురం ఆర్టీసీ డిపోకు తరలించినట్టు చెప్పారు. అందులో ప్రయాణిస్తున్న సుమారు 36 మంది ప్రయాణికులను రామచంద్రపురం డిపో నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు.
Advertisement
Advertisement