సంక్రాంతి పండుగ అంటే ప్రైవేట్ ట్రావె ల్స్‌కు పండుగ. ఆర్టీసీకి ఆదాయం మెండుగ అన్నట్లు మారింది.పండుగ సందర్భంగా పది రోజులు సెలవులు దొరకడంతో అందరూ ఊరికి పయనమవ్వాలని ఉత్సాహం చూపుతన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక దోపిడీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఫుల్ కావడం, సీట్లుదొరక్క.. అడిగినంత ఇవ్వకతప్పడం లేదు.
సాక్షి కడప :తెలుగువారి పెద్ద పండుగ కోసం హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై ప్రాంతాలనుంచి జిల్లా వాసులు తమ సొంతూళ్లకు రానున్నారు. వీరిని దోచుకునేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ రంగం సిద్ధం చేసుకున్నాయి. సాధారణ బస్సులను ప్రత్యేక సర్వీసుల పేరుతో టిక్కెట్ ధరపై అదనంగా 50శాతం వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రద్దీ, సమయాన్ని బట్టి ప్రైవేట్ ట్రావెల్స్ టిక్కెట్ ధరను రెండు నుంచి మూడు రెట్లు పెంచాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు.
విద్యార్థులు, ఉద్యోగులే అధికం..
జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రంలోనివిజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖతోపాటు తెలంగాణా, కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా దాదాపు 25వేలమంది ఉంటారు. పలు ప్రొఫెసనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు 5వేలమంది ఉన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పుణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నవారు మరో పదివేలమంది, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పది వేలు, జిల్లాలో ఉపాధి దొరకక బతుకుదెరువు కోసం, ఇతర పనుల నిమిత్తం వెళ్లి నిరుద్యోగులు, కూలీలు మరో 10వేలమంది ఉండొచ్చని అంచనా వీరంతా పండుగకు తమ సొంతూళ్లకు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రయాణానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ముందు జాగ్రత్త, ప్రణాళికతో సిద్ధమైన 30శాతం మందికి మాత్రమే టిక్కెట్లు దొరికాయి. మిగిలిన వారిలో 10 శాతం రైలులో వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మిగిలిన 60 శాతంలో 10శాతం మంది ప్రత్యేక వాహనాల్లో రావడానికి సన్నద్ధమయ్యారు. 50శాతం మంది చేతి చమురును వదిలించుకుంటేనే టిక్కెట్లు దొరికే పరిస్థితి ఏర్పడింది. రెండింతలు అధికంగా చెల్లిస్తేనే ఆర్టీసీ, ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్లను అందిస్తున్నారు.
టిక్కెట్లు దొరకడం గగనం
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 11వ తేదీనుంచి 17 వరకు ఇదే పరిస్థితి. రూ.500తో చేయాల్సిన ప్రయాణానికి రూ.1000 నుంచి రూ.1300 వరకు వెచ్చించాల్సిందే! అయినా సీట్లు దొరకడం గగనంగా మారింది. దీంతో దూర ప్రాంత ప్రయాణికుల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ పలు బస్సులను తిప్పేందుకు సిద్ధమైనా...లోకల్‌గా బస్సుల సమస్య ఏర్పడనుంది.
ప్రైవేట్‌కు దీటుగా ఆర్టీసీ..
ప్రైవేట్ ట్రావెల్స్ వారు రెండు రెట్లు పెంచి దోపిడీకి తెర తీసినా పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికే ప్రైవేట్ బస్సు వెబ్‌సైట్లలోనూ ధరలను పెంచి చూపిస్తున్నారు. నాన్ ఏసీ బస్సుల్లో కనీసం 70శాతం, ఏసీ బస్సుల్లో 100శాతం మేర ధరలు పెంచారు. ప్రైవేట్‌కు తోడు ఆర్టీసీ సైతం ఎక్స్‌ప్రెస్ సాధారణ సర్వీస్‌లను ప్రత్యేక సర్వీస్‌లుగా మార్చి సంక్రాంతి దోపిడీకి సిద్ధమైంది.
రైళ్లలో ప్రయాణం కష్టమే..
జిల్లా మీదుగా హైదరాబాద్, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి దాదాపు 30రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వీటిన్నింటిలోనూ ఇప్పటికే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ జాబితా ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. యువకులు, విద్యార్థులు జనరల్ బోగీల్లో ప్రయాణించినా, చిన్నారులు, మహిళలు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించాలంటే అగచాట్లు తప్పవు. జిల్లాకు సమీపంలో ఉండే గిద్దలూరుకు వచ్చే రైళ్లలోనూ ప్రయాణికులు భారీగా వస్తారు. దాదాపు 20వేలమంది తమ గమ్యస్థానం చేరతారని అంచనా.
విమానాల్లోనూ రద్దీ
దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు కడప ఎయిర్‌పోర్టు మీదుగా నడిచే విమానాలు రద్దీగా కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి మరింత రద్దీగా కనిపించే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు ట్రూ జెట్ సంస్థ ప్రయాణికులకు టిక్కెట్ రాయితీలో ఆఫర్లు ఇచ్చి...మార్చి వరకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతికే ఎక్కువ మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా కడప మీదుగా నడిచే విజయవాడ, హైదరాబాదు, చెన్నై విమాన సర్వీసులు కూడా రద్దీగానే సాగిపోతున్నాయి.
ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాం
సంక్రాంతి పండుగకు కడపజోన్ పరిధిలోని వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశాం. జనవరి 11 నుంచి 14వ తేది వరకు 500 బస్సులు తిరుగుతాయి. హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. 15వ తేది నుంచి 21వ తేదీ వరకు తిరుగు ప్రయాణం కోసం 600 బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైతే వాటిని పెంచాలని ఆయా డిపో మేనేజర్లకు ఆదేశాలిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ ఈడీ కేవీఆర్‌కే ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment