ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
- ఒకరు మృతి, 15 మందికి గాయాలు
- యర్రగొండపాలెం మండలం సర్వాయపాలెం సమీపంలో ఘటన
యర్రగొండపాలెం, న్యూస్‌లైన్: ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఒకరిని బలి తీసుకోగా.. 15 మందిని క్షతగాత్రులుగా మార్చింది. హైదరాబాద్‌కు చెందిన భవ్య ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని ఉదయగిరికి బయలుదేరింది. ఆదివారం ఉదయం యర్రగొండపాలెం మండలంలోని సర్వాయపాలెం సమీపంలోని మలుపువద్దకు రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో మార్కాపురానికి చెందిన చక్కిలం రవితేజ(28) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇతనికి బెంగళూరులోని బీబీఎంలో సీటు రావడంతో హైదరాబాదులో తాను చదివిన కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్లు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ లోగానే ఈ విషాదం జరిగింది. పామూరుకు చెందిన పాములపాటి సుజాత, కుశల్‌కుమార్, ఉదయగిరి మండలం నందిపాడుకు చెందిన నల్లబోతుల అనంతమ్మ, హైదరాబాదుకు చెందిన మక్కెన హనుమంతరావు, కీర్తన, సుజాత, దోర్నాల మండలం కటకానిపల్లెకు చెందిన షేక్ నజియా, మార్కాపురానికి చెందిన షేక్ రసూల్, తులసి, దొనకొండ మండలం సంగాపురానికి చెందిన గార్లపాటి మరియమ్మ, బస్సు డ్రైవర్ కొండలరావుతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం నరసరావుపేట, మార్కాపురం వైద్యశాలకు తరలించారు. బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు. సీఐ బీ పాపారావు, ఎస్సై పీ ముక్కంటి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు సేవలందించారు.
మార్కాపురం ఎమ్మెల్యే జంకె చొరవ..
మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కారులో హైదరాబాదుకు వెళుతుండగా.. జరిగిన ప్రమాదాన్ని తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని తన కారులో మార్కాపురంలోని వైద్యశాలకు తరలించారు. పారిశ్రామికవేత్త రావి రమేష్‌రెడ్డి కూడా ఇదే విధంగా సేవలందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.