
అదో అబద్ధాల పత్రం
సీఎం శ్వేతపత్రంపై బృందాకారత్ విసుర్లు
సభలో తీర్మానం ఎవరు చేశారు?
చంద్రబాబుకు జర్రెల మాజీ సర్పంచ్ సూటిప్రశ్న
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గర్జించిన గిరిజనం
చింతపల్లి: బాక్సైట్ తవ్వకాల విషయమై జర్రెల పంచాయతీ గ్రామసభలో తీర్మానించినట్టు శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబునాయుడు పేర్కొనడం దారుణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం చింతపల్లిలో ‘గిరిజనగర్జన’ చేపట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఆది నుంచి ఆదివాసీలంతా బాైక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని అన్నారు. 2008లో జర్రెల పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారుడైన సాగిన వెంకటరమణ ఉన్నారని, ఆయనే తీర్మానం చేసిందీ లేనిదీ చెబుతారన్నారు. దీంతో వేదికపైకి వచ్చిన ఆయన మాట్లాడుతూ 2008లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారని, ఆ సమయంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని తమకు చెప్పేవారని, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తాము ఖనిజ తవ్వకాలకు అనుకూలంగా తీర్మానం ఎలా చేస్తామని ప్రశ్నించారు.
చంద్రబాబు శ్వేతపత్రంలో ఏ మాత్రం నిజంలేదని, గిరిజనులంతా దీనిని గమనించాలన్నారు. అప్పటి పంచాయతీ తీర్మాన పుస్తకాన్ని సభలో పెట్టారు. అనంతరం బృందాకారత్ మాట్లాడుతూ సొంత పారీ ్టవారినే మోసం చేయగలిగే చంద్రబాబుకు గిరిజనులు ఒక లెక్కా అన్నారు. ఐదో షెడ్యూల్ ప్రకారం గిరిజనుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వాలకు లేదన్నారు. దొడ్డిదారిలో బాక్సైట్ తవ్వేందుకే చంద్రబాబు గిరిజన సలహామండలి ఏర్పాటు చేయలేదన్నారు. అటవీ హక్కుల చట్టం అమలయ్యేలా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. జర్రెల ప్రాంతంలో కేవలం 42 మంది మాత్రమే అటవీ భూముల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోందని, అక్కడున్న మిగిలిన వారంతా మనుషులు కాదా అని ఆమె ప్రశించారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. బాక్సైట్ తవ్వకాలతో అడవులు నాశనమై గిరిజనుల మనుగడ దెబ్బతింటుందని గతంలో గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. మన్యంలోని టీడీపీ నేతలు గిరిజనులను మోసం చేయకుండా చిత్తశుద్ధితో ఉద్యమాలు చేయాలని కోరారు. సీపీఎం నాయకులు సీహెచ్ నర్సింగరావు, లోక్‌నాధం, ప్రభావతి, కిల్లో సురేంద్ర, బి.చిన్నయ్యపడాల్, సీపీఐ నాయకులు బి.రామరాజ్యం, గిరిజనసంఘం నాయకులు జి.సత్యనారాయణ, కె.బలరామ్, పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.