
ఎంతటివారైనా వదిలిపెట్టం: కర్నూలు ఎస్పీ
కర్నూలు: పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేపట్టామని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. హంతకులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. నారాయణ రెడ్డి హత్యకు గురైన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. క్రిందిస్థాయి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో జిల్లావ్యాప్తంగా పోలీసు గస్తీని పెంచామని అయినా ఈ సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కాగా, నారాయణరెడ్డిని కిరాతకంగా హత్య చేసిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తనకు ప్రాణహాని ఉందని నారాయణరెడ్డి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, ఆయన తగిన రక్షణ కల్పించకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆయనకు తగిన భద్రత కల్పించివుంటే ఈ దారుణం జరిగివుండేది కాదని అంటున్నారు.