సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని బ్లూఫ్రాగ్ సంస్థపై సీఐడీ దాడులు మూడోరోజు కొనసాగాయి. ఇసుక కొరత సృష్టించడంలో బ్లూఫ్రాగ్ ప్రయత్నం చేసినట్లు సీఐడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. వివరాలు.. ఇసుక సరఫరా సంబంధిత వెబ్‌సైట్‌ను బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ హ్యాక్ చేసినట్లు అనుమానం రావడంతో సీఐడీ, పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు బృందాలుగా విడిపోయిన విశాఖ సీఐడీ అధికారులు సంస్థపై సోదాలు కొనసాగించారు. శుక్రవారం జరిగిన దాడుల్లో ఓ కీలకమైన సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక కొరత సృష్టించినట్లుగా ఆధారాలతో సహా గుర్తించారు.
ఇక కంప్యూటర్ల నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని ఎప్పటికపుడు అమరావతిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి చేరవేస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైం బృందాలు స్వాధీనం చేసుకున్న డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు అమరావతి ప్రధాన కార్యాలయంలో రెండు ప్రత్యేక సైబర్ క్రైం బృందాలను నియమించినట్టుగా సీఐడీ డీజీ సునీల్ కుమార్ వెల్లడించారు. డేటా విశ్లేషణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక నిపుణులను రప్పించినట్టు పేర్కొన్నారు. గతంలో సాండ్ వెబ్‌సైట్‌ను బ్లూఫ్రాగ్ సంస్థ నిర్వహించిన విషయం తెలిసిందే. (చదవండి: బ్లూఫ్రాగ్ కాదు ఎల్లో ఫ్రాగే)
Comments
Please login to add a commentAdd a comment