కొత్త కొబ్బరి కార్మికుల అభిప్రాయాలను సేకరిస్తున్న సూర్యమణి (అంతరచిత్రం)
అమలాపురం టౌన్/అంబాజీపేట: కోట్లాది రూపాయల లావాదేవీలతో ఒకప్పుడు అంబాజీపేట కొబ్బరి మార్కెట్ దేశంలో మంచి పేరుగడించింది. కేరళలోని అలెప్పీ మార్కెట్ తర్వాత స్థానం దీనిదే. 20 ఏళ్ల క్రితం ఇక్కడ 107 కొత్త కొబ్బరి దుకాణాలు ఉండేవి. 2వేల మందికి పైగా కొబ్బరి కార్మికులు ఇక్కడ ఉపాధి పొందేవారు. కొబ్బరి ఉత్పత్తుల్లో తమిళనాడు రాష్ట్రం దూసుకురావడం, కర్ణాటకకు సైతం కొబ్బరి పంట విస్తరించడంతో ఈ మార్కెట్ ఘన కీర్తి కరుగుతూ వచ్చింది. నేడు ఇక్కడ కొత్త కొబ్బరి దుకాణాలు 20 మాత్రమే ఉన్నాయి. వీటిని నమ్ముకుని జీవించే కొబ్బరి కార్మికులు పని దొరకని అభద్రతా భావం అలుముకుంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్... కొత్త కొబ్బరి కార్మికుల జీవన íస్థితుగతులపై అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలేనికి చెందిన సూర్యమణి పరిశీలన చేసి ఆ వివరాలను సేకరించింది. కొబ్బరి కార్మికుల శ్రమైక జీవనంలోకి తొంగి చూసి వారి మనోభావాలను, అభిప్రాయాలను సేకరించింది.
భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెసర్ డాక్టర్ గోకరకొండ నాగేంద్ర సూచనలతో ఆమె ఈ ప్రాజెక్ట్ చేపట్టంది. సూర్యమణి తన 45 పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కళాశాలకు సమర్పించింది. ఆమె పరిశీలనలో వెల్లడైన వివరాలు.. రెండు దశాబ్దాల కిందటి అంబాజీపే కొబ్బరి మార్కెట్లోని 107 కొత్త కొబ్బరి దుకాణాల్లో దుకాణానికి సగటున 20 మంది కొత్త కొబ్బరి కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం 20 దుకాణాలకు తగ్గిపోవడంతో కొందరు సంప్రదాయంగా తమకు తెలిసిన ఈ వృత్తిలోనే కష్టమైనా...నష్టమైనా ఉండిపోయారు. మరికొందరు చేతి నిండా పనులు లేక తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడ కొబ్బరి కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు ఇతర వృత్తుల్లో ఉపాధి వెతుక్కున్నారు. ప్రస్తుతం ఉన్న 20 దుకాణాల్లో దాదాపు 200 మంది కార్మికులు పని చేస్తున్నారు. వారికి వచ్చే వేతనాలతో కుటుంబ పోషణ సాఫీగానే సాగిపోతున్నా ఇళ్లలో ఏవైనా శుభకార్యక్రమాలు జరిగినా, దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలైనా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అంబాజీపేట కొబ్బరి మార్కెట్ 20 ఏళ్ల క్రితం వరకూ దేశంలో కీలక స్థానంలో ఉండేది. కేరళలోని అలెప్పీ మార్కెట్ తర్వాతి స్థానం ఈ మార్కెట్‌దే. అయితే అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఇది నేల చూపు చూసింది. ఆ ఘనకీర్తి మసకబారింది. దీనిపై ఆధారపడిన కార్మికులు గత్యంతరం లేక వలసబాట పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment