కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: అసలే ఎండాకాలం.. అగ్ని ప్రమాదం జరిగిందంటే క్షణాల్లో అంతా భస్మమై పోతుంది. ఇలాంటి సమయాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలో ఇవి దిష్టిబొమ్మల్లా మిగిలాయి. వీటిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు భారీ నష్టం వాటిల్లుతోంది. చాలా చోట్ల వాహనాలు చాలకపోవడం, రిపేర్లు, నీటి కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 వేల మంది జనాభాకు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలి. కాని జిల్లాలో 12 ఫైర్ స్టేషన్లు.. 15 వాహనాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 40.40 లక్షల మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం జిల్లాకు 81 అగ్నిమాపక కేంద్రాలు ఉండాలి. కాని ఉన్నవి 12 మాత్రమే. మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసినా 54 కేంద్రాలు ఉండాల్సి ఉంది. కనీసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున కూడా లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.
కర్నూలు, నంద్యాల, ఆదోని పట్టణ కేంద్రాల్లో రెండేసి వాహనాలు ఉండగా శ్రీశైలం, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ పట్టణాల్లో అగ్ని మాపక కేంద్రాలున్నాయి. నందికొట్కూరు, కోవెలకుంట్ల పాణ్యం, మంత్రాలయంలో ఏర్పాటుకు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించినా ఇప్పటి వరకు అతీగతీ లేదు. జిల్లాలో అనుబంధంగా ఎక్కడా ఆంబులెన్స్‌లు లేకపోవడం గమనార్హం. సొంత భవనాల్లోనే కేంద్రాలు ఉన్నప్పటికీ ఆదోని, నంద్యాల స్టేషన్లు శిథిలావస్థకు చేరాయి. ఆలూరు వాహనం పదేళ్లకు పైబడి సేవలందిసోంది. దీంతో ఈ వాహనంతోపాటు మరికొన్ని వాహనాలు తరచూ రిపేర్ల కారణంగా మొరాయిస్తున్నాయి.
దిష్టిబొమ్మల్లా అగ్ని మాపక కేంద్రాలు
Published Fri, May 30 2014 1:28 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement