వాకాడు: సినీ నిర్మాత, భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత దివంగత ఎస్.గోపాల్‌రెడ్డి కుమారుడు ఎస్.భార్గవ్‌రెడ్డి (42) అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పంబలి వద్ద తన భార్గవ్ రొయ్యల హేచరీ వద్దకు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు భార్గవ్‌రెడ్డి కారులో (ఏపీ 09 బీఎన్ 4885) వచ్చాడు. అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ, పనివాళ్లతో మాట్లాడి వారికి జీతాలు, హేచరీ కరెంట్ బిల్లులు, తదితర లెక్కలు చూసి డబ్బులు అందజేశాడు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తను ప్రాణ సమానంగా పెంచుకుంటున్న కుక్కకు స్నానం చేయించే నిమిత్తం హేచరీ ముందు భాగంలో ఉన్న సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లాడు. ఒక్కరే సముద్రం వద్దకు వెళ్లొద్దు.. మేము వస్తామని సిబ్బంది కోరగా ఆయన ఎవరూ అవసరం లేదు. నేనే వెళ్తానని కుక్కని తీసుకెళ్లాడు.
రాత్రంతా వెతికినా..
సముద్రం వద్దకు వెళ్లి భార్గవ్‌రెడ్డి గంట దాటినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన హేచరీ సిబ్బంది సముద్రం వద్దకు వెళ్లారు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఒడ్డున భార్గవ్‌రెడ్డి చెప్పులు, ప్యాంట్ మాత్రమే ఉన్నాయి. అందులో ఏటీఎంలు, ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసెన్స్, ఓటర్ కార్డు, కొంత నగదు, విస్టింగ్ కార్డులున్నాయి. కంగారు పడిన సిబ్బంది వెంటనే వాకాడు గొల్లపాళెం గ్రామంలోని భార్గవ్‌రెడ్డి పెద్దమ్మ కుమారుడు పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరులో ఉన్న చిన్నాన్న ఎస్.కృష్ణారెడ్డిలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు పంబలికి చేరుకుని గ్రామస్తుల సాయంతో సముద్రం ఒడ్డున మంగళవారం తెల్లవారుజాము వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 6.00 గంటల సమయంలో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాసపురం గ్రామం వద్ద సముద్రం ఒడ్డుకు భార్గవ్‌రెడ్డి మృతదేహం కొట్టుకువచ్చింది. కుక్క ఆచూకీ మాత్రం తెలియరాలేదు.
మృతిపై అనుమానాలు
భార్గవ్‌రెడ్డి మృతిపై అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయాడా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని పంబలిలోని భార్గవ్ హేచరీకి తీసుకెళ్లారు. బంధువుల ఫిర్యాదు మేరకు వాకాడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పంబలి గ్రామంలోనే మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు.
నాయుడుపేటలో విషాదం
నాయుడుపేటటౌన్: భార్గవ్‌రెడ్డి (44) మృతిచెందడంతో మంగళవారం నాయుడుపేటలోని బేరిపేట సమీపంలో ఉన్న ఆయన నివాసం వద్ద విషాదం నెలకొంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి 2008లో మృతిచెందిన తర్వాత భార్గవ్ ఒక్కరే నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో నుంచి ఎప్పుడూ బయటకు వచ్చే వారు కాదని, పనివారే అన్ని వసతులు సమకూర్చేవారని స్థానికులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం పదిరోజుల పాటు ఇంటికి రానని చెప్పి పంబలిలో ఉన్న గెస్ట్‌హౌస్ వద్దకు వెళుతున్నానని భోజనాలు ఏర్పాటుచేసే నిర్వాహకులకు భార్గవ్ తెలిపారు. ఆయన సోదరి పావని తైవాన్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె ఐక్యరాజసమితి సభ్యురాలిగా పనిచేస్తున్నారని, పదిరోజుల క్రితం నాయుడుపేటలో ఉన్న భార్గవ్‌రెడ్డిని చూసేందుకు వచ్చి తిరిగి వెళ్లినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. పావని వచ్చేందుకు మూడురోజులకు పైగా పడుతుందని చెబుతున్నారు. ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిపే అవకాశం ఉంది. నెల్లూరులోని ఓ ఆస్పత్రి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసేందుకు పలువురు వెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment