అధ్యాపకుడు.. ప్రేమ పేరుతో వంచించాడు | Professor has betrayed in the name of love .. | Sakshi
Sakshi News home page

అధ్యాపకుడు.. ప్రేమ పేరుతో వంచించాడు

Published Sat, Nov 8 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

అధ్యాపకుడు.. ప్రేమ పేరుతో వంచించాడు

అధ్యాపకుడు.. ప్రేమ పేరుతో వంచించాడు

* భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
* మూడేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించడమే కారణం
* నడుముకు తీవ్ర గాయాలు.. విజయవాడ తరలింపు
* జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్టలో ఘటన

 
ఏలూరు (వన్‌టౌన్) : పేదరికంలో మగ్గిపోతున్న తమ కుటుంబాన్ని బాగా చదివి ఆదుకోవాలనుకున్న ఆ యువతి ఆశయాలను కామాంధుడైన అధ్యాపకుడు కాల రాశాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువతి చివరకు నడుం విరగ్గొట్టుకుని ఆసుపత్రి పాలైంది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

జంగారెడ్డిగూడెం మండలం ఉప్పలమెట్టకు చెందిన నాగేశ్వరరావు, నాగమణి కుమార్తె బాదిన బేబీషాలిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరింది. అదే కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో బోటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్న తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురానికి చెందిన ఎన్.కిషోర్ బేబిషాలినితో ప్రేమలో పడ్డారు. మూడేళ్లుగా ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇంటర్ అనంతరం షాలినిని డిగ్రీ చేయనివ్వకుండా టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరాలని పట్టుబట్టాడు. బిఫార్మసీ ఫ్రీసీటు వచ్చినా వద్దని వారించాడు. ఈ క్రమంలో షాలినీ, ఆమె కుటుంబ సభ్యులు అతని వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు.

అయితే తనకు రూ.ఐదు లక్షలు కట్నం కావాలని కిషోర్ తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి గురువారం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స చేసిన వైద్యులు యువతి నడుం విరిగిందని మెరుగైన చికిత్స అందించాలని వారికి సూచించారు. దీంతో శుక్రవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నిందితుడికి నేతల అండదండలు
గురువారం రాత్రి పదిగంటల సమయంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు శుక్రవారం సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదు. రాత్రి ఆస్పత్రిలో బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేయాల్సిన జంగారెడ్డిగూడెం పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. నిందితుడు కిషోర్‌కు కొందరు అధికార పార్టీ నేతలు అండగా నిలిచి కేసు లేకుండా చేసేందుకు విఫలయత్నం చేసినట్టు తెలిసింది. విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు హడావుడిగా ఏలూరు చేరుకుని అప్పటికప్పుడు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.

అతనితోనే పెళ్లి చేయాలి
‘కిషోర్‌ను ఏమీ చేయవద్దని, అతనితో తనకు పెళ్లి చేయాలి’ అని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాలినీ శుక్రవారం విలేకరుల వద్ద వాపోయింది. యువతి తల్లిదండ్రులు కూడా తాము పేదోళ్ళం బాబు మా కూతురికి అతనితో పెళ్లి జరిగితే చాలయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షాలినీకి ఇంకా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులు సూచించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement