విజ్ఞాన ప్రపంచంలో ఇంగ్లిష్‌ పరిజ్ఞానం తప్పనిసరి | Professor Nageshwar Comments With Sakshi About English Medium | Sakshi
Sakshi News home page

విజ్ఞాన ప్రపంచంలో ఇంగ్లిష్‌ పరిజ్ఞానం తప్పనిసరి

Published Mon, Apr 27 2020 3:44 AM | Last Updated on Mon, Apr 27 2020 5:21 AM

Professor Nageshwar Comments With Sakshi About English Medium

సాక్షి, అమరావతి: విజ్ఞానంతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆంగ్ల భాషా పరిజ్ఞానం, నైపుణ్యాలు బాగా ఉన్నవారికే ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ స్పష్టం చేశారు. ఆంగ్ల నైపుణ్యాలు ఉన్నవారికే ఆదాయం కూడా ఎక్కువగా వస్తోందని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్‌ ఎవరూ కాదనలేని వాస్తవమని తేల్చిచెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపవుట్లు పెరగడానికి కారణం.. అక్కడ ఇంగ్లిష్‌ మాధ్యమం లేకపోవడమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి ఆంగ్ల మాధ్యమంలో సమర్థంగా, సమగ్రంగా బోధించగలిగేలా టీచర్లను తీర్చిదిద్దాలన్నారు. అప్పుడే ఆంగ్ల మాధ్యమం సత్ఫలితాలిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 

► మాతృభాషలో బోధన శాస్త్రీయమే అయినప్పటికీ ఈనాటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇంగ్లిష్‌ ప్రభావమే ఎక్కువ. గ్లోబల్‌ ఎకానమీ, గ్లోబల్‌ నాలెడ్జి దానిపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య లావాదేవీలు కూడా అత్యధికం ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయి.
► ప్రతిభావంతులైన విద్యార్థులు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు.
► స్టార్‌ హోటల్‌లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం రావాలన్నా మంచి ఇంగ్లిష్‌ రావాలి.
ఆ స్థాయిలో ప్రపంచ ఎకానమీ మారింది. మంచి ఉద్యోగం, ఆదాయం పొందాలంటే అది ఇంగ్లిష్‌తోనే సాధ్యం. ప్రపంచ పరిజ్ఞానం కూడా అత్యధికం ఇంగ్లిష్‌లోనే ఉంది. ఆ విజ్ఞానాన్ని సముపార్జించాలంటే ఇంగ్లిష్‌ మాధ్యమం కావాల్సిందే.

► అయితే తెలుగు మీడియంలో చదువుకుంటూ ఇంగ్లిష్‌ను నేర్చుకుంటానన్నా అవకాశం ఇవ్వాలి.
► బోధన ఏ మాధ్యమంలో ఉండాలన్నది తల్లిదండ్రులు, పిల్లల నుంచే తెలుసుకోవాలి. వారి అభిప్రాయం మేరకు మాధ్యమం పెట్టాలి.
► ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఇంగ్లిష్‌ మీడియమే కోరుతున్నారు. నా అభిప్రాయం కూడా ఇంగ్లిష్‌ మాధ్యమం ఉండాలనే.
► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియాన్ని పెడితే డ్రాపవుట్లను కూడా నియంత్రించొచ్చు.

ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి
ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ప్రతి స్కూల్‌లో సమర్థులైన ఇంగ్లిష్‌ టీచర్లను నియమించాలి. ఇంగ్లిష్‌ ల్యాబ్స్, పుస్తకాలు,రిఫరెన్సు గ్రంథాలను సమకూర్చాలి. అదేవిధంగా అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్‌ మీడియానికి మార్చేటప్పుడు ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా పాఠశాలల్లో ప్రమాణాలు పెరగాలి. బోధన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. అలాంటి ప్రమాణాలుంటేనే అన్ని వర్గాల మధ్య సమానత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొనే పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది.  

ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు అందుకే..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం లేకపోవడం వల్లే డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. పేదలు కూడా తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియం కోసమే ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. పేదపిల్లలు ప్రైవేటు స్కూళ్లకు ఎందుకు వెళ్తున్నారని అధ్యయనం చేస్తే కనిపించే మొట్టమొదటి కారణం.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం లేకపోవడమే.

భాషాభిమానం ఉన్నా వాస్తవాన్ని గ్రహించాలి
భాషాభిమానం ఉండొచ్చు కానీ రియాలిటీ ఏమిటో గుర్తించాలి. మన అభిప్రాయాలతో రియాలిటీని ఆపలేం. తెలుగును ప్రేమించినంత మాత్రాన ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యతిరేకించాల్సిన పనిలేదు. తెలుగు పండితులు, కవుల పిల్లలు ఈరోజు ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement