
వారిది చానళ్ల ఆరాటం : సంధ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలది చాన్నాళ్ల పోరాటం, సీమాంధ్రులది చానళ్ల ఆరాటమని టీ-జేఏసీ కోకన్వీనర్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య వ్యాఖ్యానించారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడుతూ సాధించుకున్న తెలంగాణను కాపాడుకుందామని కోరారు. దోమలగూడలోని సిరిరాజ్ మీడియా సెంటర్‌లో (ఎస్‌ఎంఎస్) సోమవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో డాక్టర్ల జేఏసీ నాయకురాలు అనితారెడ్డితో కలసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమం స్పాన్సర్డా, కృత్రిమమా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలు లేవని, ప్రాంతాలు, సంస్కృతుల మధ్యే వైరుధ్యం ఉందని, తెలుగు వారి ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరగలేదని తెలిపారు.
విడిపోవడానికి తెలంగాణ ప్రజలు అనేక కారణాలు చూపుతున్నా.. ఎందుకు కలిసి ఉండాలో అనడానికి సీమాంధ్రులు ఒక్క కారణం కూడా చూప డం లేదన్నారు. ఎంపీ లగడపాటి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావులాంటి సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్ చుట్టుపక్కల కోట్లాది రూపాయల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి తమ వల్లనే అని సీమాంధ్రులు చెపుతున్నారని, ప్రతిష్ఠాత్మకమైన ప్రాగాటూల్స్, హెచ్‌ఎంటీ, ఆల్విన్ వంటి కంపెనీలను మూసివేయడమే అభివృద్ధా? ఆ భూములన్ని సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. ఏకాభిప్రాయం పేరిట మహిళా బిల్లుకు మోసం చేశారని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టకుండా అడ్డుకునే ప్రమాదం ఉందని, ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సంధ్య ఆరోపించారు. తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులకు అభద్రతాభావం లేదని, ఏవైనా అపోహలుంటే తొలగించుకోవాలని ఆమె కోరారు.