కేసిఆర్ చనిపోతాడన్న భయంతో 2009లో విభజన ప్రకటన చేశారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు.
కేసిఆర్ చనిపోతాడన్న భయంతో 2009లో విభజన ప్రకటన చేశారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సీమాంధ్ర నేతల సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఆడింది నాటకమని డిసెంబర్ 9 ప్రకటనకు ముందే చెప్పామని ఆయన అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండవని, జూలై 30 ప్రకటనతో మరిన్ని సమస్యలు వస్తాయని అధిష్ఠానానికి ముక్తకంఠంతో చెప్పామని కావూరి తెలిపారు. 2009లాగే 2013లోనూ కేంద్రం వెనక్కువెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర పరిస్థితులను వివరించేందుకు ఢిల్లీ వెళ్తామని, తమకు పార్టీకన్నా ప్రజలే ముఖ్యం అని కావూరి చెప్పారు. తమ ఒత్తిడి మేరకే కేంద్రం ఆంటోని కమిటీని నియమిచిందని చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆంటోనీ కమిటీనీ కోరతామని చెప్పారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కమిటీకీ స్పష్టం చేస్తామన్నారు. అనంతరం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అయితే.. రాజీనామాలపై మాత్రం సీమాంధ్ర నేతల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. చివరి ప్రయత్నంగా సోనియాను కలవాలని సీమాంధ్ర నేతలు నిర్ణయించారు.