విభజన దిశగా సీమాంధ్ర కేంద్ర మంత్రుల కొత్త పల్లవి
రూ.4 లక్షల కోట్లు కోరిన చంద్రబాబు బాటలో కాంగ్రెస్ మంత్రుల డిమాండ్లు
జీవోఎం సభ్యులు మొయిలీ, చిదంబరంలతో కావూరి, శీలం, పురందేశ్వరి, చిరంజీవి భేటీ
విభజన వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం చెప్పాలని విజ్ఞప్తి
సీమాంధ్రలో కొత్త రాజధానికి ఎన్ని నిధులిస్తారంటూ ప్రశ్న
తగిన పరిష్కరాలు చూపి ప్యాకేజీలిస్తే ప్రజలను ఒప్పించగలమని వెల్లడి
దొరకని ప్రధాని అపాయింట్‌మెంట్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తప్ప మరో ఇతర ప్రతిపాదనకు తలొగ్గేది లేదంటూ డాంబికాలు పలుకుతూ వచ్చిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు.. అధిష్టానం డెరైక్షన్లో విభజన దిశగా అడుగులు వేస్తున్నారు. తమది సమైక్యవాదం కాదని, సమస్యావాదమని చెబుతూ.. ప్యాకేజీవాదన మొదలుపెట్టారు. సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలిస్తే రాష్ట్రాన్ని విభజించేసుకోవచ్చన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాటలో కాంగ్రెస్ మంత్రులు డిమాండ్లు మొదలుపెట్టారు. సీమాంధ్రలో కొత్త రాజధానికి ఎన్ని నిధులిస్తారంటూ జీవోఎం సభ్యులను ప్రశ్నించారు. విభజనతో సీమాంధ్రలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, వాటిని ఎలా పరిష్కరిస్తారో ముందుగా స్పష్టత ఇచ్చాకే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని వారు జీవోఎంకు విజ్ఞప్తి చేశారు. తగిన పరిష్కారం చూపితే, తగిన ప్యాకేజీలు ఇస్తే విభజనకు అంగీకరించేలా ప్రజలను తాము ఒప్పించగలమని వెల్లడించారు.
గురువారం జీవోఎం కీలక సమావేశానికి ముందు జీవోఎం సభ్యులు వీరప్ప మొయిలీ, చిదంబరంలతో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, చిరంజీవి, జేడీ శీలం విడివిడిగా భేటీ అయ్యారు. పార్టీ నేతలుగా, ప్రభుత్వంలో భాగస్వాములుగా తెలంగాణపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడతామని, అయితే విభజన అనంతరం విద్య, ఉద్యోగ, ఉపాధి, సాగు నీటి రంగాల్లో సీమాంధ్రకు ఎలా న్యాయం చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. సీమాంధ్రను అన్ని విధాలా ఆదుకునేందుకు ఎలాంటి ప్యాకేజీలు ప్రకటిస్తారో ముందుగానే వెల్లడించాలని విన్నవించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు తీసుకునే చర్యలేంటి? సీమాంధ్రలో కొత్తగా నిర్మించే రాజధానికి ఏ మాత్రం నిధులు కేటాయిస్తారు? పోలవరంపై తెలంగాణవాదులు లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారాలు ఏంటీ? కొత్తగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు ఎలా? అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కేంద్రంపై ఎంతైనా ఉందన్నారు. ఇక ఇవే అంశాలను ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి విన్నవిద్దామని మంత్రులు భావించినా ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదు.
సమస్యల పరిష్కారంవైపే మా ప్రయత్నం: జేడీ శీలం
మొయిలీతో భేటీ అనంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. తమది సమైక్యతావాదం కాదని సమస్యావాదమని జేడీ శీలం స్పష్టం చేశారు. అయితే సమైక్యతా వాదం, సమస్యావాదం వేరుకాదని అన్నారు. విభజన అనంతరం సమస్యల పరిష్కారంవైపుగా తాము ప్రయత్నం చేస్తున్నామని, వాటికి పరిష్కారాలు చూపాలని జీవోఎం సభ్యులను కోరామన్నారు. తగిన పరిష్కారం చూపితే ప్రజలను తాము ఒప్పించగలమన్నారు. ఉద్యోగాలు రావని విద్యార్థులు, నీళ్లు రావని రైతులు, భద్రత ఉండదని హైదరాబాద్‌లోనీ సీమాంధ్రులు భయాందోళనలతో ఉన్నారని, వారి భయాలను తొలగించేలా జీవోఎం చర్యలు చేపట్టాలన్నారు. విభజన జరిగినా తెలుగు ప్రజలు భవిష్యత్తులో వైషమ్యాలు పెంచుకోకుండా సామరస్యపూర్వకంగా ఉండేలా జీవోఎం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా ఇరు ప్రాంతాలు కలిసుండాలని కోరారు. తాము జీవోఎంకు ఎలాంటి నివేదికలు ఇవ్వడం లేదని, ఎలాంటి ప్యాకేజీలూ కోరడం లేదని చెప్పారు.
భయాందోళనలు తొలగించాలి: చిరంజీవి
విద్యార్థులు, ఉద్యోగులు, పెట్టుబడిదారులు అంతా హైదరాబాద్‌నే నమ్ముకొని ఉన్నారని, ప్రస్తుత విభజన ప్రకటనతో వారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, వాటిని ముందుగా నివృత్తి చేయాల్సిన బాధ్యత జీవోఎంపై ఉందని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల అనుమానాలను నివృత్తి చేసేలా, సీమాంధ్రుల ప్రయోజనాలను పరిరక్షించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలనే తాము కోరుతున్నామని, ప్యాకేజీలు కోరడం లేదని చెప్పుకొచ్చారు. శుక్రవారం నాటి సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు.