ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో, పార్టలో తలెత్తిన విభేదాల పరిష్కారం కోసం కాంగ్రెస్ అధినాయకులు ఏర్పాటుచేసిన ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఇతర నేతలు గురువారం రాత్రి సమావేశమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి తిరునావక్కరసు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
దీనికి కేంద్ర మంత్రులు చిరంజీవి, ఎం.ఎం. పళ్లంరాజు, కిశోర్‌చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరి, తిరుపతి ఎంపీ చింతా మోహన్, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి హాజరయ్యారు.
అయితే, రేణుకా చౌదరి మాత్రం సమావేశానికి హాజరై కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదేమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. 'ఇది మా పార్టీ కార్యాలయం.. ఇష్టం వచ్చినప్పుడు వస్తాం.. వెళ్లిపోతాం. నేను నిన్నటి సమావేశంలో పాల్గొనలేదు.. ఈ సమావేశంలోనూ పాల్గొనలేదు' అని ఆమె సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ వార్ రూంలో మిగిలిన నాయకులతో సమావేశం ఇంకా కొనసాగుతోంది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో, ఉద్యోగులు కూడా తమ జీతాలు, జీవితాలను సైతం పణంగా పెట్టి పోరాడుతుండటంతో సీమాంధ్ర ప్రతినిధులపై ఒత్తిడి ఎక్కువగానే ఉంది. అటు కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎదురు చెప్పలేకపోవడం, మరోవైపు సొంత ప్రాంతాల్లోని ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని కాదనలేకపోవడంతో వీరంతా ఆంటోనీ కమిటీకి ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది.
ఆంటోనీ కమిటీతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
Published Thu, Aug 15 2013 8:24 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement