తెలంగాణపై వెనక్కి వెళ్లలేం: మన్మోహన్ సింగ్
సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ప్రధాని స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘మంచో, చెడో నిర్ణయం చేశాం, ఇప్పుడు దానినుండి వెనక్కు వెళ్లలేం. విభజన ప్రక్రియను నిలిపివేయడం నా చేతుల్లో లేదు. రాజీనామాల కారణంగా విధులకు హాజరుకావడం, కాకపోవడం మీ ఇష్టం..’’ అని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులతో అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని, తాము సమర్పించిన రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ సీమాంధ్రకు చెందిన ఆరుగురు కేంద్ర మంత్రులు సోమవారం ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. సుమారు 45 నిమిషాలు కొనసాగిన భేటీలో కావూరి సాంబశివరావు, ఎం.ఎం.పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి, కిల్లి కృపారాణి పాల్గొన్నారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విభజన నిర్ణయానంతరం ఏర్పాటైన ఆంటోనీ కమిటీ తన నివేదికను సమర్పించకముందే కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలుపడంపై నిరసన వ్యక్తం చేశారు.
విభజన ప్రక్రియను నిలిపివేసి సీమాంధ్రుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం ద్వారా కోస్తా, రాయలసీమల్లో రెండు మాసాలుగా ఉద్యమిస్తున్న ప్రజలను శాంతింపజేయాలని కోరారు. తెలంగాణపై ఇతర అన్ని పార్టీలతో సంప్రదించిన కాంగ్రెస్ అధిష్టానం, ప్రభుత్వం.. సీమాంధ్రలోని సొంత పార్టీ నాయకులను విశ్వాసంలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం తమను బాధిస్తున్నదని తెలిపారు. విభజన నిర్ణయంతో సీమాంధ్ర భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాము మంత్రి పదవుల్లో కొనసాగలేమని, తమ రాజీనామాలను ఆమోదించాలని మంత్రుల్లో నలుగురు ప్రధానిని ఒత్తిడి చేసినట్టు సమాచారం. కాంగ్రెస్‌ను మాత్రం వదలబోమంటూ హామీ ఇచ్చినట్టు తెలిసింది. తమ రాజీనామాలను సైతం ప్రజలు నమ్మడం లేదని, డ్రామాలుగా భావిస్తున్నారని దీంతో తాము ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని చిరంజీవి, కోట్ల, పురందేశ్వరి ప్రధానితో అన్నారు.
ప్రధానికి పల్లంరాజు రాజీనామా లేఖ
ఇలావుండగా గతంలోనే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించినా సోనియాతో సమావేశానంతరం వెనక్కు తగ్గినట్టు కనిపించిన మంత్రి పల్లంరాజు సోమవారం స్వయంగా ప్రధానికి రాజీనామా లేఖను సమర్పించారు. ముగ్గురు మంత్రుల రాజీనామాలు తనకు అందాయని ప్రధాని ధ్రువీకరించిన తర్వాత పల్లంరాజు రాజీనామా పత్రాన్ని అందజేశారని తెలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని గట్టిగా కోరినప్పటికీ జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, కిల్లి కృపారాణి మాత్రం రాజీనామాలు సమర్పించలేదు, వాటిపై చర్చ జరుగుతున్నప్పుడు కూడా వారు నోరుమెదపలేదని తెలిసింది. ప్రధానితో సమావేశానంతరం చిరంజీవి నివాసంలో కొద్దిసేపు సమావేశమై భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించుకొన్న మంత్రులు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా వీరిద్దరూ ముఖం చాటేశారు. వీరితోపాటు ఇప్పటికే రాజీనామా ప్రసక్తే లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పిన సహాయ మంత్రి పనబాక లక్ష్మి, ఢిల్లీలో లేని గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి కిశోర్‌చంద్ర దేవ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జె.డి.శీలం కూడా రాజీనామాలకు దూరంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాను అశక్తుడనన్న ప్రధాని నుంచి తమ రాజీనామాలను ఆమోదించే విషయంలో కూడా ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో తాము మంగళవారం నుండి విధులకు హాజరుకాబోమని నలుగురు మంత్రులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని ‘అది మీ ఇష్టం..’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
సమైక్యంగా ఉంచాలని కోరాం: పురందేశ్వరి
ప్రధానితో భేటీ తర్వాత పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, చిరంజీవిలతో కలిసి పురందేశ్వరి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే డిమాండ్‌తో ప్రధానిని కలిసినట్లు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశాలు కనిపించకపోవడంతో మంత్రి పదవులకు తాము సమర్పించిన రాజీనామాలను ఆమోదించాలని కోరామన్నారు. రాజీనామాలు చేసినందున ప్రభుత్వ బాధ్యతలను నిర్వర్తించలేమని కూడా చెప్పామని, మంగళవారం నుండి విధులకు హాజరు కారాదని నిర్ణయించుకొన్నామని తెలిపారు. మంగళవారం జరిగే ప్రత్యేక మంత్రివర్గ సమావేశానికి పల్లంరాజు కూడా దూరంగా ఉంటారని చెప్పారు. రాజీనామాల విషయంలో కావూరి సాంబశివరావు వైఖరి ఏమిటన్న ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ఆమె నిరాకరించారు. ఆ విషయం ఆయన్నే అడగాలని సూచించారు.