పరిగి, న్యూస్‌లైన్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో పంటల సాగు ఆశాజనకంగా ఉందని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పరిగిలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఏడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 2లక్షల 965 హెక్టార్లు కాగా ప్రస్తుతం 2.70లక్షలలో ఆయా పంటలు సాగయ్యాయని తెలిపారు.
వీటిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం నమోదు కాగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. పత్తి, జొన్న పంటలు సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే తగ్గాయన్నారు. ఎరువులు ముఖ్యంగా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో డీఏపీ 44500 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 51 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. యూరియా 59వేల మెట్రిక్ టన్నులకు గాను ఇప్పటివరకు 35 వేల మెట్రిక్ టన్నులు అందజేశామని, మిగతాది సెప్టెంబర్ వరకు పంపిణీ చేస్తామన్నారు. 50 శాతం ఎరువులు డీసీఎమ్మెస్ గోదాముల ద్వారా మిగతాది ప్రైవేటు డీలర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని ఆయన వివరించారు.
రైతులు అపోహలు వీడాలి..
ఎరువులు వాడటంలో రైతులు అపోహలు వీడాలని జేడీఏ కోరారు. సన్న యూరియా, దొడ్డు యూరియాలోనూ 46 శాతం నత్రజనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రైతులు అపోహలతో దొడ్డు యూరియాతో పాటు నీమ్ కోటింగ్ యూరియా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని, సమావేశాలు ఏర్పాటు చేయించి వారి అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో రూ.438 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 64 శాతం రుణాలు రైతులకు ఆయా బ్యాంకుల ద్వారా అందించామన్నారు. అలాగే ఇటీవల ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ నగేష్‌కుమార్, ఏఓలు రేణుకా చక్రవర్తి, సుధారాణి, పాండు, ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.
జిల్లాలో పంటల సాగు ఆశాజనకం
Published Wed, Aug 21 2013 3:48 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement