సాక్షి, నెల్లూరు : పర్యావరణ పరిరక్షణ కోసమంటూ నీరు-చెట్టు పేరు తో నెల్లూరు నగరపాలక సంస్థ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం ప్రచార ఆర్భాటానికే పరిమితమైం ది. నామమాత్రంగా కొద్ది సంఖ్యలో మొక్కలు నాటి చేతులు దులిపేసుకోవడం, వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో పథకం లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు.
పేరుకు లక్ష మొక్కలు నాటే కార్యక్రమమని మేయర్ అజీజ్ ఆర్భాటంగా ప్రకటించినా వారం గడిచేటప్పటికి ఆరంభశూరత్వమే తప్ప మరేమిలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వివిధ రూపాల్లో పంపిణీ చేసింది 25 వేల మొక్కలయితే, వాటిలో ఎన్ని నాటారో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది. మొక్కలు నాటుతామని ప్రకటించిన వారు కొందరు ఏకంగా చెట్లనే తెచ్చి నాటారనే విమర్శలూ ఉన్నాయి. పథకం అమలులో ప్రణాళిక కరువవడంతో ఈ పరిస్థితి నెలకొందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎప్పటికి పూర్తయ్యేనో..
మొదట నేను- నా మొక్క పేరుతో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్లు మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. ఇంతలో సీఎం చంద్రబాబు నీరు-చెట్టు పేరుతో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం చేపట్టి గతనెల 24న వెంకటాచలంలోని అక్షర విద్యాలయం ఆవరణలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్ తాను కూడా మొక్కలు నాటుతున్నానని సీఎంకు వివరించారు. మంచి కార్యక్రమమని పలువురు మెచ్చుకోవడంతో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. నాటడమే కాదు వాటి రక్షణ, పెంపకం బాధ్యతలు తమవేనని, ప్రతి మొక్కకో రికార్డు ఏర్పాటు చేస్తామని అజీజ్ ప్రకటించారు.
వారంలోపే లక్ష మొక్కలు నాటుతామన్నారు. వారం గడిచాక చూస్తే అధికారిక లెక్కల ప్రకారం పాఠశాలల విద్యార్థులకు 10 వేల మొక్కలు, స్వయంసహాయక గ్రూపులకు 15 వేలు పంపిణీ చేశారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో 6 వేల మొక్కలు నాటారు. ఈ క్రమంలో పంపిణీ చేసిన మొత్తం మొక్కల సంఖ్య 31 వేలకు దాటలేదు. పంపిణీ చేసిన మొక్కల్లో ఎన్ని నాటారనే అంశంపై అధికారుల వద్ద వివరాలు కరువయ్యాయి. ఉన్న వివరాలను చెప్పేందుకు కూడా అధికారులు నీళ్లు నమిలే పరిస్థితులు నెలకొన్నాయి. మేయర్ ప్రకటించినట్లు ప్రతి మొక్కకు సంబంధించి వివరాల నమోదుపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
నిర్వహణ గాలికి..:నామమాత్రంగా మొక్కలు నాటినప్పటికీ వాటి నిర్వహణను గాలికొదిలేశారు. మొక్కలకు నీళ్లు పోసే పరిస్థితి కనిపించడం లేదు. నాటిన వారం రోజులకే ఎక్కువ మొక్కలు ఎండుముఖం పట్టాయి. ట్రీగార్డులు ఏర్పాటు చేసేది అంత తేలిక కాదని అధికారులే పేర్కొంటున్నారు. మరోవైపు మొక్కల స్థానంలో ఏపుగా పెరిగిన చెట్లను నాటడంతో అవి బతికే అవకాశాలు లేకుండా పోయాయి. ఇప్పటికైనా మొక్కల పెంపకంపై మేయర్‌తో పాటు కార్పొరేషన్ అధికారులు ఓ ప్రణాళికతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుందని పర్యావరణ ప్రేమికులు ఆశిస్తున్నారు.
ప్రచార ఆర్భాటమే !
Published Thu, Sep 4 2014 2:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement