సాక్షి, మహబూబ్‌నగర్: వర్షాలు సరిగా కురియకపోవడంతో కనీసం బోరు నీటితోనైనా వ్యవసాయం చేసుకుందామని భావించిన రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా అప్పులుచేసి బోరువేసుకుంటున్న అన్నదాతకు విద్యుత్ కనెక్షన్లు పొందడం గగనమైపోయింది. జిల్లాలో చాలా మండలాల్లో రైతుల చేత డీడీలు కట్టించుకుని ఏళ్లు గడుస్తున్నా కనెక్షన్ ఇవ్వకుండా విద్యుత్‌శాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారు.
ఇప్పుడుఅప్పుడు అంటూ రైతులను చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారు. అంతేకాదు తమ ఆవేదన చెప్పుకొంటే చులక నగా చూస్తున్నారని వారు వాపోతున్నారు. ఇలా జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులు ఏటా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 28,351 దరఖాస్తులు పెండిగ్‌లో ఉన్నట్లు అంచనా. జిల్లాలో అధికారికంగా 2,19,990 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా వ్యవసాయ కనెక్షన్ల కోసం 28,351 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఎస్టీలకు సంబంధించి 3,836 ఉండగా, ఎస్సీలకు సంబంధించిన 2,302 దరఖాస్తులు మూలకుపడ్డాయి. జిల్లాలో అత్యధికంగా మద్దూరు మండలంలో 1246 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ధరూరులో 1102, వీపనగండ్లలో 902 దరఖాస్తులకు అతీగతిలేకుండా పోయింది. అయితే విద్యుత్‌శాఖ అధికారులు మాత్రం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు.
నీటి సౌకర్యం లేక..!
జిల్లాలో మక్తల్, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాలకు మాత్రమే ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సౌకర్యం ఉంది. కానీ కల్వకుర్తి, అచ్చంపేట, నారాయణపేట, షాద్‌నగర్, కొడంగల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల రైతులు ప్రధానంగా బోరుబావులపైనే ఆధారపడి పంటలు చేస్తుంటారు. ఈ ప్రాంత రైతులు అప్పోసప్పోచేసి బోర్లు వేసుకుని కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలను సాగుచేస్తారు. పాడి పశువులకు అవసరమయ్యే పచ్చిమేతను బోర్లకిందే సాగుచేస్తారు. అయితే విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి కావడంతో ట్రాన్స్‌కో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. డీడీలు కట్టాలని చెప్పిన అధికారులు, వాటిని తీసుకెళ్తే తమవైపు చూడడం లేదని రైతులు వాపోతున్నారు.
అప్పులు చేసి బోర్లు వేసుకున్నాం
నాకున్న మూడెకరాల పొలంలో ఏడాది క్రితం బోరు వేసుకున్నాను. నీళ్లు పడ్డాయి కానీ విద్యుత్ కనెక్షన్ లే దు. కనెక్షన్ ఇవ్వాలంటే వ్యవసాయబోరుకు రూ.5450 డీడీ కట్టమని విద్యుత్ అధికారులు సూచించారు. దీంతో వెంటనే డీడీ కట్టినా.. కనెక్షన్ ఇవ్వలేదు. నాతో పాటు మరో నలుగురు డీడీలు కట్టారు. అందరికి కలిపి ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసి విద్యుత్ కనెక్షన్ ఇస్తామని ఏడాది కాలంగా అధికారులు తిప్పుకుంటున్నారు. - కడేల భీమప్ప, రైతు, చింతల్‌దిన్నె, మద్దూరు మండలం
ఏళ్ల తరబడిగా తిప్పుకుంటున్నారు
నాకు ఐదెకరాల పొలం ఉంది. 2008 మార్చిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం రూ.5850 డీడీ చెల్లించాను. అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు. పనులు వదులుకుని నిత్యం తిప్పుకుంటున్నారే తప్ప నేటికీ ఇవ్వలేదు.
- వెంకట్‌రెడ్డి,
పాతపాలెం, ధరూరు మండలం
తిరిగి తిరిగి వేసారిపోయా..
2008లో ట్రాన్స్‌ఫార్మర్ కోసం రూ.5850 డీడీలు చెల్లించాం. మేము తీసుకుపోకుండానే మా పేర వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎ వరో తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. గత్యంతరం లేక మేము ప్రైవేటుగా రూ.80వేలు చెల్లించి తెచ్చుకున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగితిరిగి వేసారిపోయినం..
- చాంద్‌పాష, పాతపాలెం, ధరూరు మండలం
సారీ.. ఆగాల్సిందే!
Published Wed, Aug 6 2014 3:37 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement