హైదరాబాద్‌పై కొర్రీ పెడితే కాంగ్రెస్ పాతరే! | 'protect' hyderabad from 'clutches' of seemandhras | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌పై కొర్రీ పెడితే కాంగ్రెస్ పాతరే!

Published Thu, Sep 26 2013 3:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'protect' hyderabad from 'clutches' of seemandhras

జహీరాబాద్ టౌన్,న్యూస్‌లైన్: కేంద్రప్రభుత్వం సీమాంధ్ర నేతల వత్తిడికి తలొగ్గి హైదరాబాద్‌పై కొర్రీపెడితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను పాతరేయడం ఖాయమని టీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కత్తి వెంకటస్వామి హెచ్చరించారు. ఈ నెల 29న హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో జరుగనున్న సకల జనభేరికి మద్దతుగా బుధవారం జహీరాబాద్‌లో టీజేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సభ నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
 
ఉపాధ్యాయులు రాంచందర్ భీంవంశీ, బస్వరాజ్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. టీజేఏసీ కన్వీనర్ మొగుడంపల్లి ఆశప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్నాహక సభలో కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అనేక పోరాటాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రకటన వచ్చిందన్నారు. అయితే హైదరాబాద్‌పై  ఎవరిష్టమొచ్చినట్లు వారు మాట్లాడడంతో అయోమయం నెలకొందన్నారు.  హైదరాబాద్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందన్నారు. హైదరాబాద్‌పై పేచీ పెడితే ఇక్కడి ప్రజలు తిరగబడతారన్నారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. తెలంగాణ వస్తే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కుతాయన్నారు. టీ జేఏసీ పశ్చిమ కమిటీ చెర్మైన్ ఆశోక్ కుమార్ మాట్లాడుతూ ఏపీ ఎన్‌జీఓలు నిర్వహించిన సభలో కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే జై తెలంగాణ అంటే సహించలేనివారు 4 కోట్ల ప్రజలను ఎలా సహిస్తారన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటుచేయాలని, అప్పటివరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు.
 
బీజేపీ ఆధికారంలోకి రాగానే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గౌని శివకుమార్,మల్లికార్జున్ పాటిల్, టీజేఏసీ నేతలు రవికిరణ్, ఆశోక్‌రెడ్డి, సామెల్, జబ్బార్, శ్రీకాంత్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు నామ రవికిరణ్ గుప్తా, టీఎల్‌ఎఫ్ నేతలు పాండురంగం,సిద్దన్న సిద్దారెడ్డి,సురేందర్, మాలమహానాడు రాష్ట్ర నేత ఇస్మాలప్ప, టీఆర్‌ఎస్ నేతలు యాకూబ్, బండి మోహన్,రాకేష్, కలీం, బీజేపీ నేతలు బస్వరాజ్ పాటిల్, శ్రీనివాస్‌గౌడ్, చెంగల్ రాజశేఖర్,సుధీర్ బండారీ,రాజ్‌కుమార్ దేశ్‌పాండే, వివిధ సంఘాల నాయకలు నూరుల్ హసన్ ఘోరీ,రాములు నేత, కెవీఆర్ రెడ్డి, వరాలు, కిష్టయ్య, డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement