పార్లమెంటు పవిత్రతను కాపాడండి
అఖిలపక్ష సమావేశంలో ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేసి పార్లమెంటు పవిత్రతను కాపాడాలంటూ వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం ఇక్కడ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్లమెంటు సజావుగా సాగాలని, అర్థవంతమైన చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు.అప్పట్లో హడావుడిగా రాష్ట్ర విభజన జరిగిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిందని వివరించారు. అయితే పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇప్పటికీ అమలు కాకపోవడంతో.. ఏపీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడలేకపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.