నిరసనలతో హోరెత్తిన సిక్కోలు
Published Tue, Jan 7 2014 3:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ పిలుపు మేరకు జిల్లాలో సోమవారం నిరసనల హోరు కొనసాగింది. నియోజకవర్గ కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో సిక్కోలు హోరెత్తింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ కూడలి వద్ద వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీమాంధ్రప్రాంత ప్రజలు ఎంతగా ఉద్యమించినా కేంద్రం కనీసం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కూడలి వద్ద ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, జిల్లా కమిటీ సభ్యులు అంధవరపు సూరిబాబు, మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు టి.కామేశ్వరి, పీస శ్రీహరి, ఎన్ని ధనుంజయ్‌లు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురంలో నాయకులు మానవహారం నిర్వహించారు. బస్డాండ్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీ మండల కన్వీనర్లు పిలక పోలారావు, పిన్నింటి ఈశ్వరరావు, జిల్లా ఎస్పీ సెల్ కన్వీనర్ ఎస్.దేవరాజ్, బల్లాడ రవికుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాతపట్నం: నియోజకవర్గ కేంద్రంలో ఆల్ ఆంధ్రా కూడలి వద్ద సమైక్యాంధ్ర సాధన కోసం పార్టీ సమన్వయకర్త కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి, టెక్కలిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకురాలు దువ్వాడ వాణి ఆధ్వర్యంలో కోటబొమ్మాళి జాతీయ రహదారిపై విద్యార్థులతో మానవహారం నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. అనంతరం సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రైనీ డిఎస్పీ శ్రీలక్ష్మీ వైఎస్‌ఆర్ సీపీ నాయకులను అరెస్ట్ చేసి అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడిచిపెట్టారు. టెక్కలి వైఎస్‌ఆర్ కూడలిలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.కోత మురళీధర్ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. పార్టీ నాయకులు బాడాన మురళీ, చింతాడ ధర్మారావు, చింతాడ మంజుగణపతి పాల్గొన్నారు.
రాజాం: రాజాం వైఎస్‌ఆర్ కూడలి వద్ద పార్టీ శ్రేణులు భారీ మానవహారం నిర్వహించారు. అనంతరం కొద్దిసేపు ధర్నా చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త పిఎంజె బాబు, మాజీ ఎంఎల్‌ఏ కంబాల జోగులు పాల్గొన్నారు. ఆమదాలవలస: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రధాన రహదారిపై ర్యాలీ, రైల్వేస్టేషన్‌కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్‌రావు, బొడ్డేపల్లి మాధురి, నాయకులు దవళ అప్పలనాయుడు, జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పలాస: సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు, యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాశీబుగ్గ పెట్రోల్ బంకు నుంచి ర్యాలీ ప్రారంభమైంది. జై జగన్, జై సమైక్యాంధ్ర, కాంగ్రెస్ డౌన్ డౌన్, సోనియా గాంధీ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ సమైక్యవాదుల నినాదాలతో రహదారులు దద్దరిల్లాయి. అక్కడ నుంచి ప్రారంభమైన ర్యాలీ కాశీబుగ్గ పాత జాతీయ రహదారి మీదుగా మూడు రోడ్ల కూడలికి చేరుకుంది. అక్కడ మానవహారం నిర్వహించి యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కమిటీ కన్వీనర్ బళ్ల గిరిబాబు, వజ్రపుకొత్తూరు మండల కన్వీనర్ తామాడ చంద్రభూషణ్ పాల్గొన్నారు.
పాలకొండ: పాలకొండ ఆంజనేయ కాంప్లెక్స్ సమీపంలో నియోజకవర్గ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి నేతృత్వంలో పార్టీ శ్రేణులు సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాలకొండ-శ్రీకాకుళం రహదారిలో ధర్నా చేశారు. సీతంపేటలో మండల కన్వీనర్ జి.సుమిత్రరావు నేతృత్వంలో మండల కేంద్రంలో మానవహారాలు చేపట్టారు. పాలకొండలో జరిగిన కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ చందకజగదీష్‌కుమార్, వీరఘట్టం మండల కన్వీనర్ దమలపాటి వెంకటరమణ పాల్గొన్నారు.
Advertisement