ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పోరాడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తీపికబురు అందించింది. రెండు నెలల జీతాన్ని ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ) పద్ధతిలో అడ్వాన్సుగా చెల్లించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ కేఎస్‌ఆర్ మూర్తి అంగీకరించారు. సమైక్యాంధ్ర ఉద్యోగ జేఏసీ నేతలు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ఇటీవల ఎస్‌బీఐ ఆర్‌ఎంను కలిశారు. సమ్మెలో పాల్గొంటున్నందున తమకు జీతాలు రాలేదని, రెండు నెలల జీతాలు అడ్వాన్సుగా చెల్లించాలని కోరారు. దీనికి ఆర్‌ఎం అంగీకరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఖాతాలున్న బ్యాంకులను సంప్రదించి అవసరం మేరకు ఒకటి, రెండు నెలల జీతాన్ని ఓడీ పద్ధతిలో అడ్వాన్సుగా పొందేందుకు వెసలుబాటు కల్పించారు.
జిల్లాలో ఆగస్టు 13వ తేదీ నుంచి ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. జీతాలు చెల్లించే ఖజానా శాఖ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో సెప్టెంబర్ 1న జీతాలు అందలేదు. నెలసరీ నిత్యావసరాలు, పాలు, కరెంట్, ఇంటి అద్దె, పిల్లల ఫీజులు తదితరాల కోసం ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. మరికొందరు తప్పక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. జిల్లాలో సుమారు 75 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నెలవారీ జీతాలు పొందుతున్నారు.
అక్టోబర్‌లో అడ్వాన్సులు
తమ బ్యాంకు ద్వారా అక్టోబర్ మొదటి వారంలో ఓవర్‌డ్రాఫ్ట్ పద్ధతిలో రెండు నెలల జీతం అడ్వాన్సుగా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక సంతపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ చీఫ్ మేనేజర్ బీవీ రమణయ్య తెలిపారు. ఒంగోలు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, చీమకుర్తి, సంతనూతలపాడు తదితర మండలాల టీచర్లు, ఉద్యోగుల ఖాతాలు ఈ బ్యాంకులో ఉన్నాయి. తమ బ్యాంకులో ఖాతాలున్న ఉద్యోగులందరికీ ఓడీ ఇస్తామన్నారు.
రెండు నెలల జీతం ఓవర్‌డ్రాఫ్ట్ ఇచ్చేందుకు ఉద్యోగులు అభ్యర్థన పత్రం, జీతం స్లిప్, బ్యాంకు పాస్ పుస్తకం, మొదటి పేజీ, చివరి పేజీ, ఐడీ ఫ్రూఫ్, పాస్‌పోర్టు సైజు ఫొటోతో బ్యాంకులో సంప్రదించాలని ఆయన సూచించారు. సోమవారం నుంచి అభ్యర్థన పత్రాలను స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 7వ తేదీ నుంచి ఉద్యోగుల ఖాతాలకు నిధులు జమ చేస్తామని వివరించారు. డబ్బులను బ్యాంకు కౌంటర్ల నుంచి లేదా ఏటీఎంల నుంచి డ్రా చేసుకోవచ్చు. ఓడీగా ఇచ్చే రెండు నెలల జీతంపై 18.25 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఉద్యోగులు సమ్మె విరమించి విధులకు హాజరైన తర్వాత వచ్చే జీతాలను ఓవర్‌డ్రాఫ్ట్‌కు జమ చేసుకుంటామని రమణయ్య తెలిపారు. జీతాన్ని ఓవర్‌డ్రాఫ్ట్‌గా పొందేందుకు బ్యాంకులోని రిలేషన్ మేనేజర్ రాజేశ్‌రామ్‌ను 80082 66605 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రమణయ్య కోరారు.
సమ్మెలో ఉన్న ఉద్యోగులకు తీపి కబురు: రెండు నెలల జీతం అడ్వాన్స్
Published Sat, Sep 28 2013 6:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement